ఫస్ట్ డోస్ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న మోహన్ లాల్

  • కొచ్చిలో వ్యాక్సిన్ వేయించుకున్న సూపర్ స్టార్
  • అమృత ఆసుపత్రిలో వ్యాక్సిన్ వేయించుకున్నట్టు వెల్లడి
  • వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలిపిన మోహన్ లాల్
దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. ప్రతి రోజు లక్షలాది మంది వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. తాజాగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు.

కేరళలోని కొచ్చిలో తొలి డోసు వ్యాక్సిన్ వేయించుకున్నట్టు సోషల్ మీడియా ద్వారా ఆయన వెల్లడించారు. వ్యాక్సిన్ ను వేయించుకుంటున్న ఫొటోను షేర్ చేసిన ఆయన... అమృత ఆసుపత్రిలో వ్యాక్సిన్ వేయించుకున్నానని తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, వైద్య సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

వ్యాక్సిన్ తయారు చేస్తున్న కంపెనీలకు కూడా మోహన్ లాల్ కృతజ్ఞతలు తెలియజేశారు. కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా ఆసుపత్రులు, వైద్య సిబ్బంది నిర్విరామంగా కృషి చేస్తున్నారని ప్రశంసించారు. సినీ నటుల్లో మోహన్ లాల్ తో పాటు ఇప్పటికే కమలహాసన్, అనుపమ్ ఖేర్ వంటి స్టార్లు కూడా తొలి డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు.

మోహన్ లాల్ నటించిన తాజా చిత్రం 'దృశ్యం 2' మళయాల వర్షన్ విడుదలై, ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో, ఈ సినిమా దర్శకుడు జీతూ జోసెఫ్ దాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రీమేక్ చేయబోతున్నారు. తెలుగులో వెంకటేశ్ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. 


More Telugu News