ఐదేళ్ల శ్రమ ఫలించింది.. ‘గీత’ తల్లిదండ్రులు దొరికారు!

  • మహారాష్ట్రలోని పర్భణీలో ఆమె తల్లి మీనా
  • గీత అసలు పేరు రాధ అంటున్న మీనా
  • వివరాలు వెల్లడించిన స్వచ్ఛంద సంస్థలు
  • గుర్తులు సరిపోలుతున్నాయని వెల్లడి 
  • డీఎన్ఏ టెస్టుపై ప్రభుత్వమే నిర్ణయించాలని వ్యాఖ్య 
ఎట్టకేలకు ‘గీత’ తల్లిదండ్రులు దొరికారు. ఐదేళ్లుగా వారి గురించి తెలుసుకునేందుకు ఆమె చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయి. ఆమె సంరక్షణ బాధ్యతలను చూస్తున్న స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు మహారాష్ట్రలోని పర్భణీ జిల్లాలో ఆమె అసలైన తల్లిదండ్రులను గుర్తించారు.

చిన్న వయసులోనే దారి తప్పి పాకిస్థాన్ కు వెళ్లిన గీత.. 2015 అక్టోబర్ 26న నాటి విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్ సాయంతో భారత్ కు తిరిగొచ్చిన సంగతి తెలిసిందే. ఆమెను మొదట ఇండోర్ లోని ఓ స్వచ్ఛంద సంస్థలో చేర్చారు. మాటలు రాకపోవడం, చెప్పింది వినపడకపోవడం వంటి కారణాలతో పర్భణీలోని పహల్ అనే స్వచ్ఛంద సంస్థలో సంజ్ఞల భాషపై శిక్షణనిచ్చారు.

ఐదేళ్ల పాటు అక్కడే ఉన్న ఆమెను.. గత ఏడాది జులై 20న ఇండోర్ కే చెందిన మరో స్వచ్ఛంద సంస్థ ఆనంద్ సర్వీసెస్ సొసైటీకి అప్పగించింది పహల్. ఈ ఐదేళ్లలో ఆ రెండు స్వచ్ఛంద సంస్థలు గీత తల్లిదండ్రుల కోసం వెతికాయి.

గీత తల్లిదండ్రుల కోసం అందరం ఎంతో వెతికామని, ఆ ప్రయత్నాలు ఫలించాయని ఆనంద్ సర్వీసెస్ కు చెందిన జ్ఞానేంద్ర పురోహిత్ చెప్పారు. గీత తమ కూతురేనంటూ తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్, బీహార్, రాజస్థాన్ లకు చెందిన అనేక కుటుంబాలు వచ్చాయని, చివరకు మహారాష్ట్రలోని పర్భణీలోనే గీత తల్లిదండ్రులున్నట్టు తేలిందని చెప్పారు.

పర్భణీ జిల్లాలోని జింతూర్ కు చెందిన మీనా వాఘ్మారే (71) ఆమె తల్లి అని పేర్కొన్నారు. తన కూతురు రాధ (గీత అసలు పేరు) చిన్నప్పుడే తప్పిపోయిందని చెప్పిందన్నారు. ఆమె చెబుతున్న గుర్తులు కూడా సరిపోలుతున్నాయన్నారు. ‘‘తన కూతురు పొట్ట మీద కాలిన మచ్చ ఉంటుందని మీనా చెప్పారు. ఆ తర్వాత ఆశ్రమంలో చెక్ చేయించగా నిజమేనని తేలింది’’ అని పురోహిత్ చెప్పారు. గీత తండ్రి, మీనా మొదటి భర్త సుధాకర్ కొన్నేళ్ల క్రితమే చనిపోయారని, ప్రస్తుతం ఆమె రెండో పెళ్లి చేసుకుని ఔరంగాబాద్ లో ఉంటున్నారని తెలిపారు.

గీతను మొదటిసారి కలిసినప్పుడు మీనా కన్నీటి పర్యంతమయ్యారన్నారు. గీత బధిరరాలు కావడంతో మీనా మాటలేవీ గీతకు అర్థం కాలేదన్నారు. ప్రస్తుతం నెలన్నర రోజులుగా గీత పర్భణీలోని పహల్ స్వచ్చంద సంస్థలోనే ఉంటూ.. తరచూ మీనా, ఆమె మరో కూతురిని కలుస్తోంది. ఇక గీత నిజంగానే మీనా కూతురో కాదో తేల్చేందుకు డీఎన్ఏ పరీక్షలు చేయాల్సి ఉంది.

డీఎన్ఏ పరీక్షలు ఎప్పుడు చేస్తారన్నది ప్రభుత్వమే నిర్ణయించాల్సి ఉందని పహల్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు డాక్టర్ ఆనంద్ సెల్గోంకర్ చెప్పారు. గీత దారి తప్పి పర్భణీకి వచ్చి ఉంటుందని, అక్కడే అనుకోకుండా సచ్కంద్ ఎక్స్ ప్రెస్ ఎక్కి అమృత్ సర్ కు చేరుకుని ఉంటుందని అన్నారు. అక్కడి లాహోర్ కు వెళ్లే సంఝౌతా ఎక్స్ ప్రెస్ ఎక్కి పాకిస్థాన్ వెళ్లి ఉంటుందని పురోహిత్ పేర్కొన్నారు.

కాగా, పాకిస్థాన్ లో గీతకు ఆశ్రయమిచ్చి పెంచి పెద్ద చేసిన స్వచ్ఛంద సంస్థ ఈధి సంక్షేమ ట్రస్ట్.. ఈ వ్యవహారంపై స్పందించింది. ఎట్టకేలకు గీత తన తల్లిదండ్రులను కలవడం సంతోషంగా ఉందని ఆ ట్రస్ట్ యజమాని బిల్ఖీస్ ఈధి అన్నారు. తనతో గీత ఎప్పటికప్పుడు ఫోన్ లో మాట్లాడుతూనే ఉందని చెప్పారు. గత వారం తన తల్లిని కలిసినట్టు గీత చెప్పిందన్నారు.


More Telugu News