మిథున్​ చక్రవర్తికి వై+ స్థాయి భద్రతను కల్పించిన కేంద్రం

  • దాడి జరిగే ముప్పుండడంతో కేంద్రం నిర్ణయం
  • ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ
  • ఆయనతో పాటు ఝార్ఖండ్ బీజేపీ ఎంపీకి కూడా
ఇటీవలే తృణమూల్ కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ మిథున్ చక్రవర్తికి కేంద్ర ప్రభుత్వం ‘వై+’ భద్రతను కల్పించింది. బెంగాల్ లో ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఆయనకు భద్రత పెంచినట్టు ఓ అధికారి తెలిపారు. ‘‘మిథున్ చక్రవర్తికి వై+ భద్రతను ఏర్పాటు చేశాం. ఎన్నికల ప్రచారానికి వెళ్లే క్రమంలో ఆయనకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్ కు చెందిన సాయుధ సిబ్బంది రక్షణ ఇస్తారు’’ అని పేర్కొన్నారు.

ఆయనపై దాడి జరిగే ముప్పుందని కేంద్ర నిఘా వర్గాలు ఇటీవలే హోం మంత్రికి నివేదిక ఇస్తూ, ఆయనకు భద్రతను పెంచాలని సూచించాయి. ఈ నేపథ్యంలోనే భద్రతను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆయనతో పాటు ఝార్ఖండ్ కు చెందిన బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబేకూ అలాంటి భద్రతనే కల్పించింది.

నలుగురైదుగురు సిబ్బంది వారికి రక్షణగా ఉంటారు. వీరితో కలిపి సీఐఎస్ఎఫ్ భద్రతనిస్తున్న వీఐపీల సంఖ్య 104కు పెరిగింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో పాటు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ కూ సీఐఎస్ఎఫ్ రక్షణ కల్పిస్తోంది.


More Telugu News