తన చుట్టూ రగులుకున్న వివాదంపై మనస్తాపం.. దేత్తడి హారిక షాకింగ్ నిర్ణయం!

  • బ్రాండ్ అంబాసిడర్ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటన
  • తనకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు
  • వీడియో విడుదల చేసిన హారిక
తెలంగాణ పర్యాటక శాఖ ప్రచారకర్తగా నియామకం అయిన తర్వాత తన చుట్టూ రగులుకున్న వివాదంపై యూట్యూబర్ దేత్తడి హారిక తీవ్ర మనస్తాపం చెందినట్టు కనిపిస్తోంది. దీంతో తనకు అలాంటి పదవులేమీ వద్దని, మునుపటిలా తన పనేదో తాను చేసుకుంటానంటూ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

 మహిళా దినోత్సవం రోజున తనను తెలంగాణ టూరిజం శాఖ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించిన దగ్గరి నుంచి ఏం జరిగిందో మీ అందరికీ తెలుసని, కొన్ని కారణాలతో ఆ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు హారిక పేర్కొంది. ఈ విషయంలో తనకు మద్దతు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపిన హారిక.. ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించాలని వేడుకుంది.

హారికను పర్యాటకశాఖ ప్రచారకర్తగా నియమించినప్పటి నుంచి వివాదం మొదలైంది. ప్రభుత్వానికి, ఆ శాఖ మంత్రికి ఎలాంటి సమాచారం లేకుండానే ఆమెను పదవిలో నియమించారన్న ప్రచారం జరిగింది. ఆమె నియామకంపై పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. నిన్న మంత్రి మాట్లాడుతూ హారిక ఎవరో తనకు తెలియదని, ఆమెను నియమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాదు, త్వరలోనే మరో సెలబ్రిటీని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తామని చెప్పుకొచ్చారు.


More Telugu News