జగన్‌ను కలిసిన సుబ్రహ్మణ్యస్వామి.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై సంచలన వ్యాఖ్యలు!

  • తాడేపల్లిలో జగన్ ను కలిసిన స్వామి
  • ఒక కేసు నిమిత్తం ఏపీకి వచ్చిన బీజేపీ సీనియర్ నేత
  • స్టీల్ ప్లాంటును ప్రైవేటు పరం చేయాల్సిన అవసరం లేదని వ్యాఖ్య
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి కలిశారు. ఓ కేసు విషయమై ఈరోజు ఆయన ఏపీకి వచ్చారు. ఈ సందర్భంగా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లిన ఆయన జగన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా స్వామిని జగన్ సాదరంగా ఆహ్వానించారు. ఆయనను శాలువాతో సత్కరించి, తిరుమల వేంకటేశ్వరస్వామి జ్ఞాపికను అందజేశారు.

జగన్ తో భేటీ అనంతరం మీడియాతో సుబ్రహ్మణ్యస్వామి మాట్లాడుతూ, టీటీడీ లావాదేవీలను కాగ్ తో ఆడిట్ చేయించేందుకు సీఎం అంగీకరించారని చెప్పారు. వైజాగ్ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తాను ఏకీభవించడం లేదని అన్నారు. ప్రతి సంస్థను ప్రైవేటీకరించడం సరికాదని.. బలమైన కారణాలు ఉంటేనే అలా చేయాలని చెప్పారు. ప్రభుత్వం వ్యాపారం చేయాలా? వద్దా? అనే విషయాన్ని కేస్ బై కేస్ చూడాలని అన్నారు.


స్టీల్ ప్లాంట్ అంశంపై ప్రధాని మోదీతో జగన్ చర్చలు జరుపుతారని భావిస్తున్నట్టు చెప్పారు. అఖిలపక్షం, కార్మిక నేతలతో కలుస్తానని జగన్ చెప్పారని అన్నారు. దివంగత సీఎం వైయస్ రాజశేఖరరెడ్డితో తనకు మంచి సంబంధాలు ఉండేవని తెలిపారు.

పెట్రో ధరల పెరుగుదల సామాన్యుల పాలిట పెను భారంగా పరిణమించిందని విమర్శించారు. టీటీడీని స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా తీర్చిదిద్దాలని... ప్రజలే దాన్ని నడిపించేలే చేయాలని అభిప్రాయపడ్డారు. మరోవైపు, చంద్రబాబు హయాంలో టీటీడీలో చాలా అవకతవకలు జరిగినట్టు స్వామి ఆరోపించిన సంగతి తెలిసిందే.


More Telugu News