ఢిల్లీ ఎర్రకోట హింస ఘటన కేసులో డచ్​ దేశస్థుడి అరెస్ట్​

  • దేశం విడిచి పారిపోతుండగా పట్టుకున్న పోలీసులు
  • నకిలీ పత్రాలతో బ్రిటన్ కు ఉడాయించే ప్లాన్
  • అతడితో పాటు మరో వ్యక్తి అదుపులోకి
  • 14కు చేరిన అరెస్టైన వారి సంఖ్య
గణతంత్ర దినోత్సవం నాడు రైతు సంఘాల ట్రాక్టర్ ర్యాలీలో ఎర్రకోట వద్ద హింసకు పాల్పడిన ఘటనకు సంబంధించి మరో ఇద్దరిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగ పత్రాలు సృష్టించి దేశం విడిచి పారిపోవాలనుకున్న భారత సంతతి డచ్ దేశస్థుడు సహా మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మణీందర్ జీత్ సింగ్, ఖేమ్ ప్రీత్ సింగ్ లను అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు.

డచ్ దేశస్థుడైన మణీందర్ జీత్ సింగ్ మామూలుగానే నేరస్థుడని చెప్పారు. బ్రిటన్ లోని బర్మింగ్ హాంలో ఉంటున్నాడన్నారు. గణతంత్ర దినోత్సవం నాడు జరిగిన హింసలో అతడికీ హస్తం ఉందని, నకిలీ పత్రాలు సృష్టించి దేశం విడిచి పారిపోతుండగా ఢిల్లీ విమానాశ్రయంలో పట్టుకున్నామని తెలిపారు. మరో నిందితుడు ఖేమ్ ప్రీత్ సింగ్.. ఎర్రకోటలో డ్యూటీ చేస్తున్న పోలీసులపై బల్లెంతో దాడి చేశాడని చెప్పారు.

వీరి అరెస్టులతో కేసులో అరెస్టైన వారి సంఖ్య 14కు చేరింది. కేసుకు సంబంధించి నిందితులను పట్టుకునేందుకు ఢిల్లీ, పంజాబ్ లలో పోలీసులు అనేక చోట్ల దాడులు చేశారు. ఈ నేపథ్యంలోనే మణీందర్ జీత్ సింగ్ దేశం విడిచిపారిపోవాలనుకున్నాడు. ఢిల్లీ నుంచి నేపాల్, అక్కడి నుంచి బ్రిటన్ కు వెళ్లిపోవాలని ప్లాన్ వేశాడు. అతడిపై ఆయుధ చట్టంతో పాటు ఇతర కేసులూ ఉన్నాయి. కోర్టులో ప్రవేశపెట్టగా.. పోలీసు కస్టడీకీ అప్పగించింది.

ఇక, తాను ఉద్దేశపూర్వకంగానే ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్నానని, తనతో పాటు మరికొందరినీ తీసుకొచ్చానని ఖేమ్ ప్రీత్ సింగ్ పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. సంజయ్ గాంధీ ట్రాన్స్ పోర్ట్ నగర్ నుంచి బయల్దేరి బురారి, చట్టా రెయిల్ వద్ద బారికేడ్లను దాటేసి ఎర్రకోటకు చేరుకున్నామని చెప్పాడు.


More Telugu News