స్టీల్ ప్లాంట్ ను కొనేందుకు ఎవరూ రాకపోతే... దాన్ని మూసేస్తాం: కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్
- 5 ఉక్కు పరిశ్రమలను ప్రైవేటీకరిస్తున్నాం
- ఉక్కు తయారీ రంగం నాన్ స్ట్రాటెజిక్ పరిధిలోకి వస్తుంది
- ప్రభుత్వ బ్యాంకులు, బీమా సంస్థలకు కూడా ఇది వర్తిస్తుంది
వైజాగ్ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరిస్తున్నామని కేంద్రం స్పష్టం చేయడం ఏపీలో కలకలం రేపుతోంది. అధికార, విపక్ష పార్టీలన్నీ దీనిపై మండిపడుతున్నాయి. మరోవైపు ఈ అంశంపై కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ ఈరోజు మరింత స్పష్టతను ఇచ్చారు. దేశంలోనే 5 ఉక్కు పరిశ్రమలను ఐదేళ్లలో ప్రైవేటీకరించేందుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పారు. ఉక్కు పరిశ్రమలను కొనేందుకు ఎవరూ ముందుకు రాని పక్షంలో వాటిని మూసేస్తామని స్పష్టం చేశారు. ఉక్కు తయారీ రంగం నాన్ స్ట్రాటెజిక్ పరిధిలోకి వస్తుందని... ఈ విభాగంలోకి వచ్చే అన్ని పరిశ్రమలను ప్రైవేటీకరిస్తామని చెప్పారు. ప్రభుత్వ రంగానికి చెందిన సంస్థలు, బ్యాంకులు, బీమా సంస్థలకు కూడా ఇది వర్తిస్తుందని అన్నారు.