ఉత్తరాఖండ్ సీఎం రావత్ రాజీనామా

  • గవర్నర్ కు రాజీనామా పత్రాన్ని సమర్పించిన రావత్
  • సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకతే కారణం
  • సీఎం రేసులో ముందు వరుసలో ఉన్న ధన్ సింగ్ రావత్
ఉత్తరాఖండ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ (60) తన పదవికి రాజీనామా చేశారు. కాసేపటి  క్రితం రాష్ట్ర గవర్నర్ బేబీ రాణి మౌర్యను కలిసిన ఆయన తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత రావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. నిన్న ఢిల్లీలో బీజేపీ అధిష్ఠానంతో ఆయన భేటీ కావడం గమనార్హం.

ఆయన కేబినెట్ లో ఉన్న ధన్ సింగ్ రావత్ చీఫ్ మినిస్టర్ రేసులో ముందు వరుసలో ఉన్నారు. ఈ మధ్యాహ్నం ధన్ సింగ్ ఓ ప్రత్యేక హెలికాప్టర్ లో రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్ కు చేరుకున్నారు. రావత్ నాయకత్వంపై కొంత కాలంగా సొంత పార్టీలో అసంతృప్తి నెలకొంది. కొన్ని రోజులుగా కనీసం 10 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు ఢిల్లీలో మకాం వేసి పార్టీ పెద్దలతో తమ వ్యతిరేకతను తెలియజేశారు.

ఈ నేపథ్యంలో, ఇద్దరు సీనియర్ నేతలను పార్టీ అధిష్ఠానం రాష్ట్రానికి పంపించింది. రాష్ట్ర కోర్ సభ్యులతో భేటీ అయిన వారు... పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు నివేదిక అందించారు. ఈ నేపథ్యంలో, సీఎం పదవి నుంచి దిగిపోవాలని రావత్ కు పార్టీ పెద్దలు సూచించినట్టు సమాచారం. 2017లో సీఎంగా రావత్ బాధ్యతలను స్వీకరించారు.


More Telugu News