జగన్ గురించి అందరు ఎంపీలకు లేఖలు రాశాను: రఘురామకృష్ణరాజు

  • నా నియోజకవర్గానికి కూడా నన్ను పంపించడం  లేదు
  • రాష్ట్రమంతా నాపై కేసులు పెట్టిస్తారు
  • ఈ ప్రభుత్వ ఎంపీగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నా
విశాఖలో తమ పార్టీ నేతలు చక్కగా వ్యాపారాలు చేసుకుంటున్నారని, కుల మీటింగులు పెడుతున్నారని, ఆంధ్ర యూనివర్శిటీ వీసీతో కూడా కుల సమావేశం నిర్వహించారని ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఎద్దేవా చేశారు.

చిత్తూరు జిల్లాలో తమ పార్టీ నాయకుడు పెద్దిరెడ్డి సుపరిపాలన అందిస్తున్నారని వ్యంగ్యంగా అన్నారు. కాంట్రాక్టులన్నీ ఆయనకే పోతున్నాయని... ఆయనకే ఎందుకు పోతున్నాయో తనకు తెలియదని చెప్పారు. 'డబ్బు దోచుకోండి, ఎవరికీ ఇబ్బంది లేదు, కానీ ప్రజాస్వామ్యాన్ని చంపేయొద్దు' అని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే హక్కును కూడా కాలరాయాలనుకోవడం దారుణమని చెప్పారు.  

ముఖ్యమంత్రి జగన్ ఇంటి నుంచి బయటకు రారని... తనను తన నియోజకవర్గానికి వెళ్లనివ్వరని రఘురాజు అన్నారు. ప్రతిపక్ష నాయకుడు కుప్పం వెళ్లకూడదు, తిరుపతి వెళ్లకూడదు... ఇదెక్కడి ప్రజాస్వామ్యమని మండిపడ్డారు. రాజన్న రాజ్యం అంటే ఇదేనా? అని ప్రశ్నించారు.

అందరు లోక్ సభ సభ్యులు, అందరు రాజ్యసభ సభ్యులకు నిన్న తన గోడును వినిపించానని... తన నియోజకవర్గానికి కూడా తనను సీఎం వెళ్లనీయడం లేదనే విషయాన్ని అందరికీ తెలియజేస్తూ లేఖలు రాశానని చెప్పారు. తాను నియోజకవర్గానికి వెళ్తున్నాననే ఉద్దేశంతో తనపై అప్పటికప్పుడు ఐదు కేసులు పెట్టించారని... రాబోయే రోజుల్లో రాష్ట్రమంతటా తనపై కేసులు పెట్టిస్తారని తెలిపారు. జగననన్న రాజ్యం అంటే ఇదేనా? ఎంపీలు వారి నియోజకవర్గాలకు కూడా వెళ్లని విధంగా జగనన్న రాజ్యం ఉంటుందా? అని విమర్శించారు.

ప్రజలు పడుతున్న కష్టాల గురించి మాట్లాడితే ఇంత టార్చర్ పెడతారా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పేరులో రెడ్డి అని ఉన్నప్పటికీ... ఆయన క్రిస్టియన్ అని అందరూ అంటుంటారని చెప్పారు. ఆయన కూడా రెగ్యులర్ గా చర్చకి వెళ్తుంటారని తెలిపారు. క్రిస్టియానిటీ తీసుకున్న అందరు ఎస్సీలకు ఆ రిజర్వేషన్ ను తొలగించాలని... అప్పుడే అసలైన దళితులకు న్యాయం జరుగుతుందని చెప్పారు.

మహిళా దినోత్సవం రోజున కనకదుర్గమ్మ గుడికి వెళ్తున్న మహిళలను అరెస్ట్ చేయడం దారుణమని... ఇలాంటి ప్రభుత్వంలో తాను కూడా ఎంపీగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నానని చెప్పారు. ఈ ఘటనపై హోంమంత్రి సుచరిత స్పందించకపోవడం శోచనీయమని అన్నారు.


More Telugu News