50 శాతం రిజర్వేషన్ల అంశంపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అభిప్రాయాలు కోరిన సుప్రీంకోర్టు

  • మరాఠా రిజర్వేషన్ల పిటిషన్ పై సుప్రీంలో విచారణ
  • 50 శాతం రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావించిన సుప్రీం
  • రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు నోటీసులు
  • తదుపరి విచారణ మార్చి 15కి వాయిదా
దేశంలో రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని 1992లో సుప్రీం కోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే, మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్లను సవాల్ చేస్తూ దాఖలైన ఓ పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ అంశాన్ని ప్రస్తావించింది.

రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని గతంలో ఇచ్చిన తీర్పును మరోసారి సమీక్షించాలని నిర్ణయించినట్టు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే వెల్లడించారు. ఆర్టికల్ 342 (ఏ) అనుసరించి, 50 శాతం రిజర్వేషన్ల అంశంపై అభిప్రాయాలు తెలపాలంటూ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేశారు. అనంతరం కేసు తదుపరి విచారణను మార్చి 15కి వాయిదా వేశారు.

1992లో ఇందిరా సహానీ కేసు విచారణ సందర్భంగా దేశంలో రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని 9 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది. దాన్ని అనుసరించి దేశంలో మొత్తంగా 49.5 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. వాటిలో షెడ్యూల్డ్ కులాలకు 15 శాతం, షెడ్యూల్డ్ తెగలకు 7.5 శాతం, ఇతర వెనుకబడిన సామాజిక వర్గాలకు 27 శాతం రిజర్వేషన్లు వర్తింపచేస్తున్నారు.

అయితే, రిజర్వేషన్ల చట్టాన్ని 76వ రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్లో చేర్చిన తమిళనాడు 50 శాతం రిజర్వేషన్ల కంటే ఎక్కువగా 69 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తోంది. నాడు, 9 మంది న్యాయమూర్తుల సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం రిజర్వేషన్లపై స్పందిస్తూ.... కొన్ని అసాధారణ పరిస్థితుల్లో రిజర్వేషన్లను విస్తరించవచ్చని పేర్కొంది. అందుకు రాజ్యాంగ సవరణ అవసరమని వివరించగా, తమిళనాడు ఆ విధంగానే చేసింది.


More Telugu News