వరుడికి కానుకగా ఎడ్లబండి!.. పెట్రో ధరల పెంపునకు నిరసనగా కాదు సుమా!

  • కుమురం భీం జిల్లాలో ఘటన
  • వ్యవసాయ పనులకు పనికొస్తుందని జోడెడ్ల బండి
  • అత్తింటి వారి ముందుచూపునకు అందరూ హ్యాట్సాఫ్
వధువు తల్లిదండ్రులు తమ స్తోమతను బట్టి పెళ్లిలో వరుడికి కారో, బైకో కట్నంగా ఇవ్వడం పరిపాటి. కానీ, ఓ కుటుంబం మాత్రం తమ అల్లుడికి ఎడ్లబండి, జోడెడ్లను కానుకగా ఇచ్చింది. పెట్రోలు భగ్గుమంటున్న ప్రస్తుత తరుణంలో ఇది మంచి ఆలోచనని కనుక భావిస్తే తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఈ కానుకకు, పెట్రో ధరల పెరుగుదలకు ఎలాంటి సంబంధం లేదు.

 కుమురం భీం జిల్లా జైనూరు మండలంలో జరిగిందీ ఘటన. స్థానిక కాశీపటేల్‌గూడకు చెందిన నగేశ్‌కు నర్నూరు మండలం ఖైర్‌డాట్వా గ్రామానికి చెందిన రేణుకతో శుక్రవారం వివాహమైంది. నగశ్ పెద్దగా చదువుకోలేదు. దీంతో పొలం పనుల అవసరాలకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో రేణుక తల్లిదండ్రులు చక్కగా అలంకరించిన జోడెడ్ల బండిని కానుకగా అందించడం అతిథులనే కాదు, విషయం తెలిసిన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అత్తింటి వారి ముందుచూపుపై అందరూ ప్రశంసలు కురిపించారు.


More Telugu News