స్క్రాపేజ్ పాలసీ ప్రకారం పాత కారును తుక్కుగా వదిలేస్తే, కొత్త కారుపై తగ్గింపు ధర: నితిన్ గడ్కరీ

  • ఇటీవలి బడ్జెట్ లో కొత్త వెహికిల్ స్క్రాపేజ్ పాలసీ
  • 5 శాతానికి పైగా కొత్త కారుపై రాయితీ
  • దేశ వాహన రంగానికి కీలక మలుపన్న నితిన్ గడ్కరీ
ఎవరైనా తమ పాత కారు స్థానంలో కొత్త కారును కొనుగోలు చేయాలని భావిస్తే, కొత్త వెహికిల్ స్క్రాపేజ్ పాలసీ, వారికి అదనపు రాయితీలను అందిస్తుందని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. పాత కారును తుక్కు కింద వదిలేస్తే, కొత్త కారుపై 5 శాతం డిస్కౌంట్ లభిస్తుందని ఆయన అన్నారు. ఈ సంవత్సరం కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనల్లో భాగంగా వెహికిల్ స్క్రాపేజ్ పాలసీని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ నూతన విధానం దేశ వాహన రంగాన్ని కీలక మలుపు తిప్పుతుందని భావిస్తున్నట్టు గడ్కరీ వ్యాఖ్యానించారు.

కారు యజమానులు స్క్రాపేజ్ పాలసీ కింద 5 శాతానికి మించిన డిస్కౌంట్ ను మాన్యుఫాక్చరింగ్ కంపెనీల ద్వారా పొందుతారని, ఆపై గ్రీన్ టాక్స్ ఉండదని, పాత కార్లపై ఉండే పొల్యూషన్ చార్జీల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చని గడ్కరీ తెలిపారు. దేశవ్యాప్తంగా ఆటోమేటెడ్ ఫిట్ నెస్ సెంటర్లను నెలకొల్పే అంశంపై చర్చిస్తున్నామని  వెల్లడించారు. కొత్త స్క్రాపేజ్ పాలసీ కింద 20 ఏళ్లు దాటిన వ్యక్తిగత వాహనాలు, 15 ఏళ్లు పైబడిన కమర్షియల్ వాహనాలు తప్పనిసరిగా ఫిట్ నెస్ టెస్ట్ కు వెళ్లాల్సి వుంటుందని ఆయన స్పష్టం చేశారు.

ఆటోమేటెడ్ ఫిట్ నెస్ టెస్ట్ సెంటర్లను ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో నెలకొల్పుతామని, వారికి కావాల్సిన సహాయ సహకారాలను ప్రభుత్వం అందిస్తుందని, స్క్రాపింగ్ సెంటర్లను రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయని గడ్కరీ స్పష్టం చేశారు. ఆటోమేటెడ్ టెస్ట్ లను దాటడంలో విఫలమయ్యే వాహనాలపై జరిమానాలు ఉంటాయని అన్నారు. ప్రస్తుతం సాలీనా 4.5 లక్షల కోట్లుగా ఉన్న ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ సమీప భవిష్యత్తులోనే రూ. 10 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు.


More Telugu News