ఎవరు బాగా ఆడతారో రండి తేల్చుకుందాం: బీజేపీ నేతలకు మమత సవాల్

  • చమురు, గ్యాస్ ధరల పెంపుకు నిరసనగా పాదయాత్ర
  • పాల్గొన్న సీఎం మమతా బెనర్జీ
  • బీజేపీ నేతలపై ధ్వజం
  • తనను దోపిడీదారు అనడంపై ఆగ్రహం
  • బీజేపీ నేతలే దోపిడీదారులను ప్రత్యారోపణలు
దేశంలో చమురు, గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సిలిగురిలో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె బీజేపీ నేతలపై ధ్వజమెత్తారు. బెంగాల్ ను దోపిడీ చేశారంటూ మోదీ సహా ఇతర బీజేపీ నేతలు తనపై చేస్తున్న ఆరోపణలను ఆమె తిప్పికొట్టారు. మీరే అతిపెద్ద దోపిడీ దారులు అంటూ పరోక్షంగా మోదీని ఉద్దేశించి పేర్కొన్నారు. రైల్వేలను, చమురు కంపెనీలను, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాను అమ్ముకోవడం దోపిడీ కాదా? అని ప్రశ్నించారు.

ఇక, తృణమూల్ నేతలు ముఠాగా ఏర్పడి కమీషన్లు దండుకుంటున్నారన్న ఆరోపణలపైనా దీదీ బదులిచ్చారు. మోదీ, అమిత్ షానే ఓ ముఠా కట్టారని, దేశంలో అందరికీ తెలిసిన ముఠా ఇదేనని విమర్శించారు. ఈ సందర్భంగా  "ఆట మొదలైంది" అనే తమ ఎన్నికల నినాదాన్ని మరోసారి ఉద్ఘాటించారు. "ఎప్పుడు వస్తున్నారో డేట్, టైమ్ ఫిక్స్ చేయండి. ఒకరి తర్వాత ఒకరు రండి... మీరెంత ఆడతారో, నేనెంత ఆడతానో చూసుకుందాం" అని మమతా సవాల్ విసిరారు.


More Telugu News