పేరు మార్చే ఆలోచన లేదన్న 'కరాచీ' బేకరీ యాజమాన్యం

  • వివాదంలో కరాచీ బేకరీ
  • కరాచీ పేరు పాకిస్థాన్ ను సూచిస్తోందని విమర్శలు
  • ముంబయి బ్రాంచ్ మూసివేత
  • పేరు కారణంగా మూసివేయలేదన్న యాజమాన్యం
  • లీజు వ్యవహారమే మూసివేతకు కారణమని వెల్లడి
హైదరాబాదు నగరంలో ఎన్నో దశాబ్దాలుగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రఖ్యాత కరాచీ బేకరి పేరు వివాదాస్పదం కావడం తెలిసిందే. పాకిస్థాన్ లోని ప్రధాన నగరాల్లో ఒకటైన కరాచీ పేరును బేకరీకి పెట్టుకోవడం పట్ల గత కొంతకాలంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే, ముంబయిలోని కరాచీ బేకరీ బ్రాంచ్ మూతపడడంతో ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. దీనిపై కరాచీ బేకరీ యాజమాన్యం స్పందించింది.

తమ బేకరీ పేరు మార్చే ఆలోచన లేదని స్పష్టం చేసింది. ముంబయిలో కరాచీ బేకరీ అవుట్ లెట్ మూసేయడానికి కారణం పేరుపై నెలకొన్న వివాదం కాదని, ఆ భవనం యజమానితో కుదుర్చుకున్న లీజు అగ్రిమెంట్ వ్యవహారమే కారణమని వివరించింది. పైగా ముంబయిలో అద్దెలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. పేరు మార్చడం కానీ, ముంబయిలో తమ బ్రాంచ్ ఎత్తివేయడం కానీ చేయబోమని కరాచీ బేకరీ యాజమాన్యంలో ఒకరైన రాజేశ్ రమ్నాని వెల్లడించారు.

ముంబయిలో మరో ప్రాంతంలో తమ బ్రాంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. తమ బేకరీ పేరు వివాదంలో చిక్కుకోవడం బాధాకరమని అన్నారు. ఓ దశలో కొంత ఆందోళనకు గురయ్యామని, అయితే బేకరీ ఘనతర వారసత్వాన్ని ముందుకు తీసుకెళతామని స్పష్టం చేశారు.

కాగా, ఎంఎన్ఎస్ పార్టీ నేత హాజీ సైఫ్ షేక్ ఇటీవల చేసిన ట్వీట్ మరోలా ఉంది. భారీ స్థాయిలో నిరసన ప్రదర్శనలు చేపట్టినందువల్ల ఎట్టకేలకు ఆ బేకరీ మూతపడిందని వెల్లడించారు. కరాచీ బేకరీ యాజమాన్యానికి తాము లీగల్ నోటీసులు కూడా పంపామని, కరాచీ అనే పదం భారతీయులు, భారత సైన్యం మనోభావాలకు వ్యతిరేకమని షేక్ వివరించారు.


More Telugu News