మీ స్కూటీ నందిగ్రామ్ లోనే పడిపోవాలని ఉంటే నేనేం చేయగలను?: దీదీపై మోదీ వ్యాఖ్యలు

  • బెంగాల్ లో ప్రధాని మోదీ బహిరంగ సభ
  • ఎన్నికల ప్రచారంలో సీఎం మమతా బెనర్జీపై వ్యాఖ్యలు
  • అక్కలా ఉంటారని ప్రజలు ఓటేస్తే మోసం చేశారని వెల్లడి
  • మేనల్లుడికి అత్తలా వ్యవహరిస్తున్నారని విమర్శలు
  • ఇటీవల దీదీ స్కూటీ నడపడంపై ఎద్దేవా
ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం మమతా బెనర్జీపై విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రజలు ఓ అక్కగా నమ్మి మీకు ఓటేస్తే మీరు మీ మేనల్లుడికి అత్తలా వ్యవహరిస్తున్నారు అంటూ వ్యాఖ్యానించారు. అభివృద్ధి పేరిట హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన మమతా బెనర్జీ బెంగాల్ ప్రజల్ని మోసగించారని విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవల మమతా బెనర్జీ ఓ స్కూటీ నడిపిన అంశాన్ని ప్రస్తావించారు.

"కొన్నిరోజుల కిందట మీరు రోడ్డుపై స్కూటీ నడిపారు. మీరు స్కూటీ నడుపుతూ కిందపడి దెబ్బలు తగిలించుకోకూడదని ప్రతి ఒక్కరూ ప్రార్థించారు. అయితే మీరు కిందపడకుండా స్కూటీ నడపడం బాగుంది కానీ, ఆ స్కూటీ తయారైన రాష్ట్రాన్ని శత్రువుగా భావిస్తున్నారు. మీ స్కూటీ భవానీపూర్ వెళుతుందని భావిస్తే నందిగ్రామ్ వైపు మలుపు తీసుకుంది. దీదీ... నేను ప్రతి ఒక్కరూ బాగుండాలనే కోరుకుంటాను, ఎవరూ నాశనమవ్వాలని కోరుకోను. కానీ  మీ స్కూటీ నందిగ్రామ్ లోనే పడిపోవాలని రాసిపెట్టి ఉంటే నేనేం చేయగలను?" అని వ్యంగ్యం ప్రదర్శించారు.
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండడం తెలిసిందే. మమతాకు వ్యతిరేకంగా బీజేపీ తరఫున సువేందు అధికారి బరిలో ఉన్నారు.


More Telugu News