బోండా ఉమ ఇంటికి వచ్చిన కేశినేని శ్వేత... సమసిన వివాదం

  • గత కొన్నిరోజులుగా బెజవాడ టీడీపీలో విభేదాలు
  • మేయర్ అభ్యర్థిగా కేశినేని శ్వేత పేరు ప్రకటించిన టీడీపీ
  • బుద్ధా, బోండా ఉమ, నాగుల్ మీరాలతో మాట్లాడిన శ్వేత
  • తామందరం ఒక్కటేనన్న బుద్ధా తదితరులు
  • శ్వేతను గెలిపించేందుకు శాయశక్తులా కృషి చేస్తామని ఉద్ఘాటన
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో విజయవాడ టీడీపీలో విభేదాలు రాజుకున్న సంగతి తెలిసిందే. కేశినేని నాని వర్గం ఓవైపు... బుద్ధా, బోండా ఉమ ఓవైపు అన్నట్టుగా పరిస్థితి తయారైంది. టీడీపీ మేయర్ అభ్యర్థిగా కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత పేరును ప్రకటించడంతో విభేదాల నేపథ్యంలో పార్టీ నేతలు కలిసివస్తారా అన్నది సందేహాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

టీడీపీ మేయర్ అభ్యర్థి కేశినేని శ్వేత పార్టీ సీనియర్ నేత బోండా ఉమ నివాసానికి వెళ్లారు. పార్టీ అగ్రనేతలు బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా, నెట్టెం రఘురామ్ లతో తాజా పరిణామాలపై చర్చించారు. సానుకూల వాతావరణంలో జరిగిన ఈ భేటీతో బెజవాడ టీడీపీలో నెలకొన్న వివాదం ఓ కొలిక్కి వచ్చింది. కేశినేని శ్వేత విజయానికి కలిసికట్టుగా శ్రమించాలని ఏకాభిప్రాయానికి వచ్చారు.

ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ, తాము అందరం ఒక్కటేనని, ఓ కుటుంబం వంటివారమని చాటిచెప్పారు. పార్టీ మేయర్ అభ్యర్థి విజయానికి సమష్టిగా కృషి చేస్తామని స్పష్టం చేశారు. పార్టీకే ప్రథమ ప్రాధాన్యత అని, పార్టీ ఆదేశాలను శిరసావహిస్తున్నామని ఉద్ఘాటించారు. చంద్రబాబే తమకు అధిష్ఠానం అని, తమకు ఇక్కడ మరో అధిష్ఠానం లేదని నెట్టెం రఘురామ్ అన్నారు.

బోండా ఉమ మాట్లాడుతూ, గతంలో వెల్లడైన లోపాలను సరిదిద్దుకుని ముందుకు సాగుతామని, మేయర్ అభ్యర్థి విజయమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. నేతలను సమన్వయం చేసే బాధ్యతను నెట్టెం రఘురామ్ తీసుకున్నారని, ఆ మేరకు నడుచుకుంటామని వెల్లడించారు.

బుద్ధా వెంకన్న మాట్లాడుతూ, తమ అభిప్రాయాలన్నింటినీ పార్టీకి నివేదించామని, దాన్ని బట్టి వారు నిర్ణయం తీసుకున్నారని వివరించారు. పార్టీ అధిష్ఠానం కూడా తమతో నాలుగైదు పర్యాయాలు మాట్లాడిందని, తాము కూడా పార్టీ గీత దాటే మనుషులం కాదని బుద్ధా స్పష్టం చేశారు. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో తమ బాధ స్వల్పమేనని, చంద్రబాబు గారిపై వచ్చిన వ్యాఖ్యలకే తాము ఎక్కువగా బాధపడుతున్నామని బుద్ధా పేర్కొన్నారు. కేశినేని శ్వేత అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడితో ప్రకటన చేయించారు కాబట్టి, అందులో తమకు ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు. ఆమె మేయర్ అయ్యేందుకు శాయశక్తులా కృషి చేస్తామని అన్నారు.

అటు, శ్వేత స్పందిస్తూ, అందరినీ కలుపుకుని ముందుకు పోతానని స్పష్టం చేశారు. ఇవాళ ఎలా కలిసిమెలిసి ఉన్నామో, ఇకముందు కూడా అలాగే ఉంటామని పార్టీ శ్రేణులకు మాటిస్తున్నామని అన్నారు.


More Telugu News