టీడీపీ పనైపోయింది.. విజయవాడలో వాళ్లకు నాలుగైదు సీట్లు కూడా రావు: మంత్రి పెద్దిరెడ్డి

  • ఏపీలో ఈ నెల 10న మున్సిపల్ ఎన్నికలు
  • తీవ్రస్థాయిలో అధికార, ప్రతిపక్షాల ప్రచారం
  • ముందు చంద్రబాబు పార్టీ సంగతి చూసుకోవాలని హితవు
  • 90 శాతం డివిజన్లు తమవేనన్న మంత్రి 
ఏపీలో ఈ నెల 10న మున్సిపల్ ఎన్నికలు జరగనుండగా, వాతావరణం మరింత వేడెక్కింది. అధికార వైసీపీ, విపక్ష టీడీపీ మున్సిపాలిటీల్లో హోరాహోరీగా ప్రచారం సాగిస్తున్నాయి. టీడీపీ తరఫున అధినేత చంద్రబాబు సైతం ప్రచార పర్వంలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ మున్సిపాలిటీపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఇక్కడ టీడీపీ నేతల మధ్య విభేదాలు నెలకొన్న నేపథ్యంలో ఎవరికి లాభించనుందన్నది ఆసక్తి కలిగిస్తోంది. ఈ క్రమంలో ఏపీ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ బెజవాడ అంశంపై స్పందించారు.

టీడీపీ పనైపోయిందని, విజయవాడలో ఆ పార్టీకి నాలుగైదు సీట్లు కూడా రావని స్పష్టం చేశారు. విజయవాడ టీడీపీలో విభేదాలు తారస్థాయికి చేరాయని, కార్యకర్తలు కూడా చంద్రబాబు మాట వినడంలేదని అన్నారు. తమను విమర్శిస్తున్న చంద్రబాబు తన సొంత పార్టీలో విభేదాల సంగతి చూసుకోవాలని హితవు పలికారు. ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో 90 శాతం డివిజన్లు తమవేనని మంత్రి పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్ అర్హతే ప్రమాణంగా ప్రభుత్వ పథకాలు అందజేస్తున్నారని, అందుకే స్థానిక ఎన్నికల్లో ప్రజలు సీఎం జగన్ కే మద్దతు పలుకుతున్నారని వివరించారు.


More Telugu News