మేమిచ్చే రూ.5 వేలు చూస్తారా... ప్రియాంక కోసిన 5 టీ ఆకులు చూస్తారా?: అసోం బీజేపీ చీఫ్

  • అసోంలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం
  • ఇటీవల ప్రియాంక గాంధీ పర్యటన
  • తేయాకు తోటల్లో సందడి చేసిన కాంగ్రెస్ నేత
  • స్పందించిన అసోం బీజేపీ చీఫ్
  • తమ పథకాలకే ప్రజలు ఓట్లేస్తారని వ్యాఖ్యలు
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఇటీవల అసోంలో పర్యటించి తేయాకు తోటల్లో సందడి చేసిన సంగతి తెలిసిందే. మహిళా కార్మికులతో కలిసి ఆమె తేయాకు కోయడం మీడియాలో ప్రముఖంగా ప్రసారమైంది. దీనిపై అసోం బీజేపీ చీఫ్ రంజిత్ దాస్ స్పందించారు. ఎన్నికల ముందు గిమ్మిక్కులు చేసేవారికి కాకుండా, ప్రజలకు మేలు చేసే పథకాలు తీసుకువచ్చిన బీజేపీ ప్రభుత్వానికే ఓటు వేయాలని అన్నారు.

మహిళా కార్మికుల కోసం తమ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని రంజిత్ దాస్ వెల్లడించారు. గర్భవతులైన మహిళా కార్మికుల కోసం మొత్తం రూ.12 వేలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నామని, 6 నెలలు ప్రసూతి సెలవులు ఇస్తున్నామని వెల్లడించారు. గర్భవతులైన మహిళా కార్మికులు ఖాతా తెరిచిన వెంటనే మొదట రూ.5 వేలు జమ చేస్తున్నామని, ఓటర్లు ఆ రూ.5 వేలు చూస్తారా? లేక ప్రియాంక గాంధీ కోసిన 5 టీ ఆకులు చూస్తారా? అని దాస్ ప్రశ్నించారు.

కాంగ్రెస్ హయాంలో అసోంలో బంగ్లాదేశీయులు ప్రవేశించి స్థానిక మైనారిటీ రాజకీయ హక్కులను హరించివేశారని ఆయన ఆరోపించారు. అందుకే ప్రజలు బీజేపీని ఎంచుకున్నారని, తాము తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా పంచాయతీ ఎన్నికల్లోనూ గెలిపించారని ఉద్ఘాటించారు.


More Telugu News