ఆ మహిళ మృతి గురించి అనవసర పబ్లిసిటీ చేయవద్దు: మీడియాకు సూచించిన బాంబే హైకోర్టు

  • పూణెలో ఇంటి బాల్కనీ నుంచి కిందకు పడి మరణించిన మహిళ
  • ఆమెకు అక్రమ సంబంధం ఉందంటూ మీడియాలో కథనాలు
  • హైకోర్టును ఆశ్రయించిన మృతురాలి తండ్రి
పూణెలో 23 ఏళ్ల మహిళ ఆత్మహత్య, ఒక వ్యక్తితో ఆమెకు అక్రమ సంబంధం ఉందనే అనుమానాలకు సంబంధించి అనవసరమైన పబ్లిసిటీ చేయవద్దని మీడియాకు బాంబే హైకోర్టు సూచించింది. జస్టిస్ ఎస్ఎస్ షిండే, మనీశ్ పితాలేలతో కూడిన డివిజన్ బెంచ్ మృతురాలి తండ్రి దాఖలు చేసిన పిటిషన్ ను ఈరోజు విచారించింది. తన కూతురుపై మీడియాలో వస్తున్న కథనాలపై పిటిషన్ లో ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

పిటిషనర్ తరపున సీనియర్ లాయర్ శిరీశ్ గుప్టే వాదిస్తూ... తన పిటిషనర్ కూతురు పూణెలోని తన ఇంటి బాల్కనీ నుంచి కిందకు పడిపోయిందని... ఫిబ్రవరి 8న ఆమె చనిపోయినట్టు ఆసుపత్రిలోని వైద్యులు ప్రకటించారని చెప్పారు. ఈ ఘటన జరిగిన వెంటనే పలు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు ఆమెకు ఒక వ్యక్తితో శారీరక సంబంధం ఉందంటూ కథనాలు రాశాయని అన్నారు.

సున్నితమైన కేసుల్లో మీడియా నియంత్రణ పాటించాలని సినీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో హైకోర్టు సూచించిందని... ఈ కేసు విషయంలో కూడా అదే విధమైన సూచనలు చేయాలని హైకోర్టును కోరారు. దీంతో అనవసరమైన పబ్లిసిటీ చేయవద్దని మీడియాకు హైకోర్టు సూచించింది.


More Telugu News