కోరలు లేని మార్గదర్శకాలు... ఓటీటీలపై కేంద్రం నియమ నిబంధనల పట్ల సుప్రీం అసంతృప్తి

  • ఓటీటీలపై నిబంధనలు తీసుకువచ్చిన కేంద్రం
  • ఇలాంటి నిబంధనలతో సమస్యలు పరిష్కారం కావన్న సుప్రీం
  • కఠినచట్టం ఉండాల్సిందేనని స్పష్టీకరణ
  • సొలిసిటర్ జనరల్ కు సూచనలు
  • కోర్టు సూచనలను అంగీకరించిన సొలిసిటర్ జనరల్
దేశంలో ఓటీటీలు, సోషల్ మీడియాలో అభ్యంతరకర కంటెంట్ దర్శనమిస్తుండడంతో కేంద్రం ఇటీవల చర్యలకు ఉపక్రమించడం తెలిసిందే. ఓటీటీలు, డిజిటల్ మీడియా నియంత్రణ కోసం ప్రత్యేకంగా నియమ నిబంధనలు రూపొందించింది. అయితే కేంద్రం ఓటీటీలపై తీసుకువచ్చిన మార్గదర్శకాల పట్ల సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కోరలు లేని మార్గదర్శకాలు అని పేర్కొంది. ఓటీటీ, డిజిటల్ మీడియా నియంత్రణకు ఇవి సరిపోవని, కఠినమైన చట్టం, కఠినమైన నిబంధనలు తీసుకురావాలని కేంద్రానికి స్పష్టం చేసింది.

తాండవ్ వెబ్ సిరీస్ నేపథ్యంలో అమెజాన్ ప్రైమ్ ఇండియా అధిపతి అపర్ణ పురోహిత్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కేవలం కొన్ని మార్గదర్శకాలు రూపొందించి ఓటీటీలను, సోషల్ మీడియాను ఎలా నియంత్రించగలరని, సమస్యలను ఏ విధంగా పరిష్కరించగలరని బెంచ్ ప్రశ్నించింది. నియమ నిబంధనలు పాటించని వ్యక్తులను, సంస్థలను బోనులో నిలబెట్టే విధంగా చట్టం ఉండాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు స్పష్టం చేసింది.

సుప్రీంకోర్టు సూచనల పట్ల సొలిసిటర్ జనరల్ అంగీకారం తెలిపారు. కేంద్రం ఈ అంశంలో తప్పకుండా కఠిన చట్టం తీసుకువస్తుందని, ఆ చట్టం విధివిధానాలను కోర్టుకు వెల్లడిస్తామని పేర్కొన్నారు. తాండవ్ వెబ్ సిరీస్ వివాదాస్పదం అయిన నేపథ్యంలో... అమెజాన్ ప్రైమ్ ఇండియా అధిపతి అపర్ణ పురోహిత్ కు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించలేమని గత నెల 25న కింది కోర్టు తేల్చి చెప్పింది. దాంతో అపర్ణ యాంటిసిపేటరీ బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.


More Telugu News