ఆదాయం పడిపోయింది.. ఖర్చులు పెరిగాయి.. అందుకే అప్పులు: ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన

  • కరోనా వల్ల రాష్ట్ర ఆదాయం పడిపోయింది
  • సంక్షేమ పథకాలకు ఎక్కువ మొత్తం అవసరమవుతోంది
  • నేను ఇప్పటికీ పాత కారునే వాడుతున్నా
ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ అంచనాల కంటే ఎక్కువ అప్పులు చేసిన విషయం నిజమేనని చెప్పారు. కరోనా వైరస్ వల్ల రాష్ట్రానికి వచ్చే ఆదాయం పడిపోయిందని... ఇదే సమయంలో ఖర్చు బాగా పెరిగిందని తెలిపారు. ఈ పరిస్థితిని ఒక్క ఏపీ మాత్రమే ఎదుర్కోవడం లేదని... అనేక రాష్ట్రాలు ఇదే సమస్యతో ఇబ్బంది పడుతున్నాయని చెప్పారు. గత ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కరోనా నియంత్రణ కోసం ప్రతి రోజు వందల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయాల్సి వచ్చిందని అన్నారు. అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

డబ్బు అవసరం ఉన్నందుకే అప్పులు చేశామనే విషయాన్ని గర్వంగా చెప్పగలనని బుగ్గన అన్నారు. తమది సంక్షేమ ప్రభుత్వమని... అందుకే ఎక్కువ మొత్తంలో డబ్బు అవసరమవుతోందని చెప్పారు. ఈ పథకాల ద్వారా అదే డబ్బును వ్యవస్థలోకి పంపుతున్నామని తెలిపారు. ప్రభుత్వ చర్యలతో రాష్ట్ర అర్థిక స్థితి మెరుగుపడుతోందని చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాల వల్ల విమర్శించేందుకు ఏమీ లేక అప్పులు అంటూ విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని దుయ్యబట్టారు.

కర్నూలులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు తనపై తప్పుడు ప్రచారం చేశారని బుగ్గన మండిపడ్డారు. గత వంద ఏళ్లుగా తమ కుటుంబం మైనింగ్ రంగంలో ఉందని చెప్పారు. తాను ఇప్పటికీ అపార్టుమెంటులోనే ఉంటున్నానని... పాత కారునే వాడుతున్నానని తెలిపారు. చంద్రబాబు చేసిన అవినీతి ఆరోపణలపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు.


More Telugu News