బంగారం స్మగ్లింగ్​ కేసులో కేరళ ముఖ్యమంత్రికి లింకులు.. కేరళ హైకోర్టులో కస్టమ్స్​ కౌంటర్​

  • అసెంబ్లీ స్పీకర్, ముగ్గురు మంత్రులకూ లింకులు
  • ప్రధాన నిందితురాలు స్వప్న చెప్పిందని వెల్లడి
  • యూఏఈ కాన్సూల్ జనరల్ తో సీఎంకు డైరెక్ట్ లింకులు
బంగారం అక్రమ రవాణా (స్మగ్లింగ్) కేసులో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు సంబంధముందని కస్టమ్స్ పేర్కొంది. ఆయనతో పాటు అసెంబ్లీ స్పీకర్ పి. శ్రీరామకృష్ణన్, ముగ్గురు మంత్రులూ అందులో ఉన్నారని వెల్లడించింది. శుక్రవారం కేరళ హైకోర్టులో కస్టమ్స్ కమిషనర్ సుమీత్ కుమార్ కౌంటర్ దాఖలు చేశారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి విజయన్, యూఏఈ కాన్సూల్ జనరల్ కు మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలను కేసులో ప్రధాన నిందితురాలైన స్వప్న సురేశ్ వెల్లడించిందని కౌంటర్ లో పేర్కొన్నారు. వారిద్దరి మధ్య జరిగిన అక్రమ లావాదేవీలనూ చెప్పిందన్నారు. ఈ విషయానికి సంబంధించి సీఎం, ఆయన ప్రధాన కార్యదర్శి, వ్యక్తిగత సహాయ సిబ్బందితో తనకు మంచి సంబంధాలున్నాయని చెప్పిందన్నారు.

సీఎం, స్పీకర్ ఆదేశాలతో ఆ అక్రమ విదేశీ సొమ్మును ఎక్కడికి తీసుకుపోయేవారో కూడా తనకు తెలుసంటూ స్వప్న ఒప్పుకొందని కౌంటర్ లో సుమీత్ కుమార్ వెల్లడించారు. కొందరు పలుకుబడి ఉన్న వ్యక్తులతో డీల్ కుదుర్చుకున్నాక ఎన్నో వ్యక్తిగత ప్రయోజనాలను సీఎం, స్పీకర్, ముగ్గురు మంత్రులు పొందారంటూ స్వప్న వెల్లడించిందని చెప్పారు. ఈ మొత్తం కేసుకు తానే ప్రత్యక్ష సాక్షినంటూ స్వప్న చెప్పిందన్నారు.

కాగా, యూఏఈ కాన్సూల్ జనరల్ అడ్రస్ తో నవంబర్ 2019 నుంచి జూన్ 2020 మధ్య జరిగిన 167 కిలోల బంగారం అక్రమ రవాణా కేసును కస్టమ్స్ అధికారులు విచారిస్తున్నారు. గత ఏడాది జులైలో 30 కిలోల అక్రమ బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు 15 మందిని అరెస్ట్ చేశారు. జాతీయ భద్రతా సంస్థ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, కస్టమ్స్ లు విడివిడిగా కేసును దర్యాప్తు చేస్తున్నాయి.


More Telugu News