టెస్లాతో పొత్తు లేదు.. ఒంటరిగానే వెళ్తాం: టాటా సన్స్​ చైర్మన్​

  • విద్యుత్ కార్ల తయారీపై చంద్రశేఖరన్
  • మా సంస్థలు బాగానే ఉన్నాయని కామెంట్
  • బయటి వారి సాయం అక్కర్లేదని వెల్లడి
టెస్లాతో కలిసి టాటా మోటార్స్ విద్యుత్ కార్ల (ఈవీ)ను తయారు చేస్తుందన్న  ఊహాగానాల మధ్య.. టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ దానిపై స్పష్టతనిచ్చారు. టెస్లాతో ఎలాంటి ఒప్పందమూ లేదని, తాము ఒంటరిగానే ఈవీలు తయారు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ తో ఎలాంటి చర్చలూ జరగలేదని చెప్పారు.  

ప్రస్తుతం టాటా మోటార్స్ , జేఎల్ఆర్ (జాగ్వార్ ల్యాండ్ రోవర్) నుంచి మంచి ఫలితాలే వస్తున్నాయని, ఇలాంటి టైంలో బయటి వారి సాయం తమకు అవసరం లేదని ఆయన తేల్చి చెప్పారు. కాగా, భారత మార్కెట్ లోకి ప్రవేశించేందుకు టెస్లా ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగా ఓ ఆఫీసునూ రిజిస్టర్ చేయించింది.

ఈ నేపథ్యంలోనే టాటా గ్రూప్ తో టెస్లా జట్టు కడుతోందన్న కథనాలు వినిపించాయి. ఈ ఊహాగానాలతో టాటా మోటార్స్ షేర్ల విలువ కూడా పెరిగింది. దానికి తోడు టెస్లా ఒప్పందమంటూ సాగిన హడావుడిపై టాటా మోటార్స్ ఈవీ విభాగం ట్వీట్ కూడా చేసింది.

‘‘మన ఇద్దరి మధ్య మొగ్గ తొడిగిన ప్రేమ అందరికీ తెలిసిపోయింది. మీడియాలో తెగ హడావుడి నడుస్తోంది. వెల్ కం టెస్లా’’ అంటూ ఎలాన్ మస్క్ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది. ఆ వెంటనే ట్వీట్ ను సంస్థ తొలగించేసింది. దీంతో ఆ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసినట్టయింది. తాజాగా ఆ వ్యాఖ్యలు, కథనాలను చంద్రశేఖరన్ తోసిపుచ్చారు.


More Telugu News