రద్దీ రోడ్డుపై మలైకా జాగింగ్.. నెటిజన్ల ట్రోలింగ్!

  • రద్దీగా ఉన్న బాంద్రా రోడ్డుపై జాగింగ్
  • వైరల్ అయిన వీడియోలు
  • నెట్టింట తీవ్ర విమర్శలు
బాలీవుడ్ బ్యూటీ, గబ్బర్ సింగ్ చిత్రంలోని 'కెవ్వు కేక...' పాటతో తెలుగు ప్రేక్షకులకూ పరిచయమైన మలైకా అరోరా, ఇప్పుడు నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం, ముంబైలో రద్దీగా ఉండే రహదారిపై ఆమె జాగింగ్ చేయడమే.

చుట్టూ కార్లు వెళుతున్నా, పట్టించుకోకుండా రోడ్డుపై ఆమె జాగింగ్ చేస్తుండటంతో విమర్శలు వచ్చాయి. బాంద్రాలో ఎన్నో జాగింగ్ పార్కులు ఉండగా, జనాలు చూడాలనే ఆమె ఇలా రోడ్డుపైకి వచ్చిందని, మీడియాలో వార్తల కోసమే ఈ పని చేసిందని సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి. ఇదేమీ ఆమె తండ్రి నిర్మించిన రహదారి కాదని కాస్తంత కటువుగానే నెటిజన్లు విమర్శిస్తున్నారు.

కాగా, 40 ఏళ్ల వయసు దాటి, ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన తరువాత కూడా ఫిట్ నెస్ పై శ్రద్ధను కనబరిచే మలైకా, తన జిమ్ కసరత్తులకు సంబంధించిన వీడియోలు, చిత్రాలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో పంచుకుంటుంటుంది. ఇటీవల మరో ఫిట్ నెస్ ఫ్రీక్ నర్వేశ్ శశితో కలిసి ఆమె ముంబై వీధుల్లో జాగింగ్ చేశారు. బ్లాక్ స్పోర్ట్స్ డ్రస్, ముఖానికి మాస్క్ ధరించిన ఆమె జాగింగ్ వీడియోలు వైరల్ అయ్యాయి.

భర్త అర్భాజ్ ఖాన్ కు విడాకులు ఇచ్చిన మలైకా, తనకన్నా 12 సంవత్సరాలు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో ప్రస్తుతం ప్రేమాయణం సాగిస్తోంది. వీరిద్దరూ కలిసి ఇటీవలి కాలంలో చాలా పార్టీలకు, డిన్నర్లకు తిరుగుతున్నారు.


More Telugu News