అమెరికాలో పెరుగుతున్న భారత సంతతి ఆధిపత్యం: నాసా సమావేశంలో జో బైడెన్ కీలక వ్యాఖ్యలు

  • ప్రతి విభాగంలోనూ భారత సంతతి మూలాలున్న వ్యక్తులు
  • మహిళలకు పెద్ద పీట వేశానన్న బైడెన్
  • నీరా టాండన్ విషయంలో మాత్రం వెనుకంజ
అమెరికాలో భారత సంతతి పౌరుల ప్రాతినిధ్యం రోజురోజుకూ పెరుగుతోందని అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన పాలనలో ఇండియన్ అమెరికన్స్ కు స్థానం లభించిందని గుర్తు చేసిన ఆయన, ప్రభుత్వంలోని ప్రతి విభాగంలో భారత సంతతి మూలాలున్న వారు ఉన్నారని చెప్పారు. తాజాగా, అమెరికా అంతరిక్ష సంస్థ నాసా నిర్వహించిన సమావేశాన్ని ఉద్దేశించి వర్చ్యువల్ విధానంలో బైడెన్ ప్రసంగించారు.

బైడెన్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి 50 రోజులు గడుస్తుండగా, పలు కీలక పోస్టుల్లో 55 మంది భారత సంతతి అమెరికన్లు నియమితులైన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావించిన బైడెన్ "ఇండియా నుంచి వచ్చిన వారి సంతతి దేశంలో విస్తరిస్తోంది. మీరు (స్వాతి మోహన్), నా ఉపాధ్యక్షురాలు (కమలా హారిస్), నా ప్రసంగాన్ని రాసింది (వినయ్ రెడ్డి)... అందరూ ఇండియన్ మూలాలున్నవారే. మార్స్ పై రోవర్ సురక్షితంగా ల్యాండ్ కావడం వెనుకా వారున్నారు" అని వ్యాఖ్యానించారు.

నాసా నిర్వహించిన మార్స్ 2020 మిషన్ కు గైడెన్స్, నావిగేషన్, కంట్రోల్ ఆపరేషన్స్ ను ఇండియన్ అమెరికన్ శాస్త్రవేత్త స్వాతి మోహన్ నాయకత్వం వహించిన విషయాన్ని గుర్తు చేశారు. అమెరికాకు 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన, నీరా టాండన్ విషయంలో మాత్రం వెనుకంజ వేయాల్సి వచ్చింది. ఆమెను వైట్ హౌస్ బడ్జెట్ చీఫ్ గా నియమించాలని భావించినా, సొంత పార్టీ నేతల నుంచి వచ్చిన ఒత్తిడితో వెనక్కు తగ్గారు.

ప్రస్తుతం బైడెన్ ప్రభుత్వంలో సివిలియన్ సెక్యూరిటీ అండ్ హ్యూమన్ రైట్స్ విభాగ కార్యదర్శిగా ఉజ్రా జియా, జిల్ బైడెన్ కు పాలసీ డైరెక్టర్ గా మాలా ఆదిగా, వైట్ హౌస్ డిజిటల్ స్ట్రాటజీ పార్టనర్ షిప్ మేనేజర్ గా ఐషా సాహా, యూఎస్ నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డిప్యూటీ డైరెక్టర్ గా సమీరా ఫాజిల్, సౌత్ ఆసియా సీనియర్ డైరెక్టర్ గా సుమోనా గుహా, డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా సబ్రినా సింగ్ తదితర మహిళలు నియమితులయ్యారు.

వీరితో పాటు శాంతి కలాథిల్, గరిమా వర్మ, సోనియా అగర్వాల్, నీనా గుప్తా, రీమా షా, తాన్యా దాస్, సుచి తలాటి, మినీ తిమ్మరాజు, సోహినీ చటర్జీ, అదితీ గోరూర్, డింపుల్ చౌదరి, షర్మిష్ఠా దాస్, రుచి జైన్, మీరా జోషి వంటి పలువురు భారత సంతతి మూలాలున్న మహిళలకు కీలక పదవులు దక్కాయి.


More Telugu News