ఆస్తి పన్ను పెంచుతామంటూ టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది: బొత్స

  • ఏపీలో మున్సిపల్ ఎన్నికల హోరు
  • ప్రజలకు ఇబ్బంది కలిగే నిర్ణయం తీసుకోబోమన్న బొత్స
  • జగన్ ప్రజలకు వ్యతిరేకంగా వెళ్లరని వెల్లడి
  • టీడీపీ పనైపోయిందని వ్యాఖ్యలు
  • లోకేశ్ పెద్దాచిన్నా లేకుండా మాట్లాడుతున్నాడని ఆగ్రహం
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ విపక్ష టీడీపీపై విమర్శలు చేశారు. మున్సిపాలిటీల్లో వైసీపీ గెలిస్తే ఆస్తి పన్ను పెంచుతుందని టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. సీఎం జగన్ ప్రజలకు ఇబ్బంది కలిగే ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోరని స్పష్టం చేశారు. ప్రజల మద్దతుతో ఇప్పటివరకు జగన్ తీసుకుంటున్న నిర్ణయాలకు సర్వత్రా ఆమోదం లభిస్తోందని అన్నారు.

జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల అభీష్టం మేరకు ఉంటుందని, అంతేతప్ప ప్రజలు ఆర్థికంగా నష్టపోయే ఎలాంటి నిర్ణయం జగన్ నుంచి రాదని బొత్స పేర్కొన్నారు. ఆస్తి పన్ను 15 శాతం మించకుండా చట్టం తీసుకువచ్చిందే తామని ఉద్ఘాటించారు.

అంతేకాదు, నారా లోకేశ్ అడ్డుఅదుపు లేకుండా మాట్లాడుతున్నాడని, చిన్నాపెద్దా తారతమ్యాలు గుర్తెరగకుండా నోటికొచ్చిన వ్యాఖ్యలు చేస్తున్నాడని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేశ్ మాటలు వింటుంటే ఇలాంటివాళ్లు కూడా రాజకీయాల్లో ఉంటారా? అన్న సందేహం కలుగుతోందని అన్నారు. రాష్ట్రంలో టీడీపీ పనైపోయిందని, కార్యకర్తలు నీరసించారని, నాయకత్వమే లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. ఇక, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రేపు జరిగే బంద్ కు తమ మద్దతు ఉంటుందని అన్నారు. 


More Telugu News