సర్వాంగ సుందరంగా ముస్తాబైన శ్రీశైలం... నేటి నుంచి మహా శివరాత్రి వేడుకలు!
- 14 వరకూ బ్రహ్మోత్సవాలు
- దీప కాంతులతో వెలుగుతున్న శ్రీశైలం
- భక్తులకు ఏర్పాట్లు చేశామన్న అధికారులు
నేటి నుంచి శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ముఖ్యమైన మల్లికార్జునుడితో పాటు శక్తిపీఠంగా భ్రమరాంబాదేవి కూడా కొలువైన శ్రీశైలంలో 14వ తేదీ వరకూ 11 రోజుల పాటు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే శ్రీశైల పట్టణమంతా విద్యుద్దీప కాంతులతో వెలిగిపోతోంది. తొలిరోజు ఉత్సవాలకే భక్తులు అధిక సంఖ్యలో చేరుకోవడంతో అద్దె గదుల కొరత ఏర్పడింది.
ఈ సంవత్సరం కొవిడ్ నిబంధనలను అనుసరిస్తూ, ఉత్సవాలను నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. భక్తుల వసతి, వాహనాల పార్కింగ్ కు ప్రత్యేక ఏర్పాటు చేశామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ బస్సులను మాత్రమే బస్టాండ్ లోకి అనుమతిస్తామని, కర్ణాటక, తెలంగాణ ఆర్టీసీ బస్సులకు గణేశ్ సదనానికి ఎదురుగా పార్కింగ్ ఏర్పాటు చేశామని ఉన్నతాధికారులు తెలిపారు. కార్ల కోసం జెడ్పీ హైస్కూల్ ప్రాంగణం, ఘంటామఠం వెనుక భాగంలో ఏర్పాట్లు చేశామన్నారు.
ఇక నేటి ఉదయం బ్రహ్మోత్సవాలకు ప్రారంభ సూచికగా, ధ్వజారోహణం కార్యక్రమం జరిగింది. ఈ 11 రోజులూ విశేష పూజలు కొనసాగుతాయని, గ్రామోత్సవం, ఇతర ఆర్జిత సేవలను రద్దు చేశామని ఆలయ ఈఓ వెల్లడించారు. భక్తులకు విక్రయించేందుకు చాలినంత ప్రసాదాలను సిద్ధం చేశామని అన్నారు.