శుభకార్యాల్లో ఖరీదైన వస్తువులు మాయం చేసే ముఠా.. ప్రధాన నిందితురాలు 8 ఏళ్ల చిన్నారి!

  • కారులో వచ్చి ఫంక్షన్లకు హాజరయ్యే ముఠా
  • సొంత బంధువుల్లా వ్యవహరించి చోరీలు
  • మైలార్‌దేవుపల్లిలో గత నెలలో ఖరీదైన కానుకలు మాయం
  • మధ్యప్రదేశ్‌కు చెందిన ముఠాగా గుర్తింపు
ఫంక్షన్ హాళ్లలో జరిగే వేడుకల్లో ఖరీదైన కానుకలను మాయం చేస్తున్న ముఠా ఎట్టకేలకు హైదరాబాద్ పోలీసులకు చిక్కింది. ముఠాలోని ప్రధాన నిందితురాలు 8 ఏళ్ల చిన్నారి కావడం గమనార్హం.

పోలీసుల కథనం ప్రకారం.. మైలార్‌దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో గత నెల 7న ఓ వివాహం జరిగింది. కారులో వచ్చిన ఓ మహిళ, ఎనిమిదేళ్ల చిన్నారి, మరో ఇద్దరు వ్యక్తులు ఈ పెళ్లికి హాజరయ్యారు. పెళ్లిలో కలిసిపోయి సొంత బంధువుల్లా వ్యవహరించారు.

ముఠాలోని చిన్నారి అదను చూసి ఖరీదైన గిఫ్ట్ బాక్స్‌లను మాయం చేసింది. అనంతరం వాటిని కారులోకి చేర్చి అందరూ కలిసి అక్కడి నుంచి మాయమయ్యారు. కానుకలు కనిపించకపోవడంతో పెళ్లి తరపు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో రాజేంద్రనగర్ పోలీసులకు కూడా ఇలాంటి ఫిర్యాదులే అందడంతో అప్రమత్తమైన పోలీసులు నిందితులు మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌ జిల్లా పిల్‌ప్లే రసోడా గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు.

బాలిక తల్లిదండ్రులు, మరో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి రూ. 50 వేల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో వీరు ఇలానే చోరీలకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు.


More Telugu News