నల్ల వ్యవసాయ చట్టాల అమలు ఫలితమే ఇది: రేవంత్ రెడ్డి

  • నిజామాబాద్ జిల్లాలో శనగ రైతుల ఆందోళ‌న‌
  • పెద్దపల్లి జిల్లాలో పత్తి రైతులు రోడ్డెక్కారు
  • కేసీఆర్ సర్కారు కొనుగోలు కేంద్రాలను ఎత్తేసింది
  • మద్ద‌తు ధరకు ప్రభుత్వ హామీ లేదు
తెలంగాణ‌లో పత్తితో పాటు మిర్చి ధరలు ఒక్కసారిగా పడిపోయాయంటూ ఓ దిన‌ప‌త్రిక‌లో వ‌చ్చిన క‌థ‌నాన్ని పోస్ట్ చేస్తూ రాష్ట్ర స‌ర్కారుపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. సీజన్ ప్రారంభంలో రూ.20 వేలకు పైగా పలికిన మిర్చి ధ‌ర ఇప్పుడు దాదాపు ఏడు వేలు తగ్గిందని అందులో పేర్కొన్న అంశాల‌ను రేవంత్ రెడ్డి ప్ర‌స్తావించారు. సిండికేట్ గా మారిన వ్యాపారులు నాణ్య‌త‌ పేరు చెప్పి ఇష్టం వచ్చినట్టు రేటు తగ్గిస్తున్నారని అందులో పేర్కొన్నారు.

దీనిపై రేవంత్ రెడ్డి ట్వీట్ చేస్తూ... 'నిజామాబాద్ జిల్లాలో శనగ రైతులు, పెద్దపల్లి జిల్లాలో పత్తి రైతులు చేసిన కష్టానికి ఫలితం కోసం రోడ్డెక్కారు. కేసీఆర్ సర్కారు కొనుగోలు కేంద్రాలు ఎత్తేసింది. మద్ద‌తు ధరకు ప్రభుత్వ హామీ లేదు. దళారులపై పర్యవేక్షణ లేదు. నల్ల వ్యవసాయ చట్టాల అమలు ఫలితమే ఇది. కేసీఆర్.. నువ్వు మోదీ వైపా? రైతుల వైపా?' అని రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు.


More Telugu News