సొంత క్యాబినెట్ లో జో బై డెన్ కు తొలి ఓటమి!

  • జనవరిలో బాధ్యతలు స్వీకరించిన బైడెన్
  • బడ్జెట్ చీఫ్ గా నీరా టాండన్ నియామకంపై తీవ్ర వ్యతిరేకత
  • నామినేషన్ ను వెనక్కు తీసుకుంటున్నట్టు వెల్లడి
  • భవిష్యత్తులో కలసి పనిచేస్తామన్న బైడెన్
ఈ సంవత్సరం జనవరిలో అమెరికాకు అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన జో బైడెన్ కు తొలిసారిగా క్యాబినెట్ సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో ఆయన తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాల్సి రాగా, అధ్యక్షుడిగా బైడెన్ కు ఇది తొలి ఒటమిగా మారింది.

వైట్ హౌస్ బడ్జెట్ చీఫ్ గా భారత సంతతి మూలాలున్న నీరా టాండన్ ను నియమించాలని బైడెన్ భావించారు. అయితే, ముఖ్యమైన సెనెటర్లు, ఇతర మంత్రుల నుంచి బైడెన్ నిర్ణయం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. నీరా టాండన్ గతంలో తాను చేసిన వ్యాఖ్యల్లో ప్రజా ప్రతినిధులను కించపరిచారని వారు బైడెన్ ఎదుటే తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.

ఆమె నియామకాన్ని స్వాగతించలేమని, ఆమెకు అనుకూలంగా ఓటును వేయబోమని మంత్రివర్గ సహచరుల నుంచి వచ్చిన ఒత్తిడికి తలొగ్గిన బైడెన్ నీరా టాండన్ నియామకాన్ని వెనక్కు తీసుకున్నారు. అయితే, నీరా నుంచే తనకు ఈ ప్రపోజల్ వచ్చిందని, తన నామినేషన్ ను విత్ డ్రా చేయాలని ఆమె కోరడంతో తాను అంగీకరించానని బైడెన్ ఓ ప్రకటనలో తెలియజేయడం గమనార్హం. ఆమె అనుభవం, నిర్ణయాలు తీసుకునే విధానంపై తనకెంతో గౌరవం ఉందని, త్వరలోనే ఆమె తన పాలనా టీమ్ లో మరో రకమైన విధుల్లోకి వస్తారనే భావిస్తున్నానని అన్నారు.

ఇక తనకు పదవి దక్కకపోవడంపై నీరా టాండన్ కూడా స్పందించారు. ఈ మేరకు బైడెన్ కు ఓ లేఖ రాసిన ఆమె, దురదృష్టవశాత్తూ బైడెన్ నాయకత్వంలో పనిచేయలేకున్నానని అన్నారు. తన నామినేషన్ ను ఉపసంహరించాలని తానే కోరినట్టు తెలిపారు. అయితే, ఇతర నియామకాల్లో మాత్రం బైడెన్ నిర్ణయాలకు మద్దతు లభించింది. విదేశాంగ మంత్రిగా ఆంటోనీ బ్లింకెన్, ట్రజరీ విభాగానికి జేన్ యెల్లెన్, పెంటగాన్ చీఫ్ గా లాయిడ్ ఆస్టిన్ లు తమ బాధ్యతలను స్వీకరించారు. ఇదే సమయంలో వాణిజ్య మంత్రిగా గినా రైమాండో, ఆర్థిక సలహాసంఘం చైర్మన్ గా సిసిలియా రౌస్ ల నియామకంపై నేడు ఉత్తర్వులు వెలువడనున్నాయి.


More Telugu News