ఇక మాస్క్ అక్కర్లేదు... 100 శాతం పూర్తి కార్యకలాపాలకు టెక్సాస్ లో అనుమతి!

  • 8 నెలల క్రితం మాస్క్ నిబంధన
  • ఇప్పుడు కరోనా పోరాటానికి చేతిలో ఆయుధాలు
  • అన్ని నిబంధనలూ సడలిస్తున్నామన్న గ్రెగ్ అబాట్
కరోనా కారణంగా తప్పనిసరి చేసిన 'మాస్క్ ధరింపు' నిబంధనను వెనక్కు తీసుకుంటున్నామని, టెక్సాస్ రాష్ట్ర వ్యాప్తంగా ఇక 100 శాతం వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించుకోవచ్చని గవర్నర్ గ్రెగ్ అబాట్ మంగళవారం నాడు స్పష్టం చేశారు. దాదాపు ఆరు నెలల నుంచి లాక్ డౌన్ నిబంధనలు సడలించినా, వ్యాపార, వాణిజ్యాలు పూర్తిగా తిరిగి ప్రారంభం కాలేదని పేర్కొన్న ఆయన, ఉద్యోగ అవకాశాలు కూడా తగ్గిపోయాయని అన్నారు.

చాలా చిన్న కంపెనీలు తాము చెల్లించాల్సిన వేతనాలు, ఇతర బిల్లుల కోసం ఎంతో కష్టపడుతున్నాయని అభిప్రాయపడ్డ అయన, ఇకపై ఆ పరిస్థితి రాదని, ప్రజలు పూర్తిగా తమ పనులు చేసుకోవచ్చని అన్నారు. లుబోక్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, "ఇదే కరోనాకు అంతం. ఇక టెక్సాస్ 100 శాతం తెరచుకున్నట్టే. ఎవరూ మాస్క్ లను ధరించడం తప్పనిసరి కాదు. ఏ వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించాలనుకున్నా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు" అని గ్రెగ్ అబాట్ వ్యాఖ్యానించారు.

కరోనా నివారణకు వ్యాక్సిన్ పెద్దఎత్తున లభిస్తోందని, అందువల్లే నిబంధనలను తొలగిస్తున్నామని స్పష్టం చేసిన ఆయన, రాష్ట్ర ప్రజల వద్ద మహమ్మారిని తరిమికొట్టే ఆయుధాలు ఉన్నాయని అన్నారు. యూఎస్ లో అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రాల్లో టాప్-2గా ఉన్న టెక్సాస్ లో ఎనిమిది నెలల క్రితం మాస్క్ ను తప్పనిసరి చేశారు.


More Telugu News