వ్యూహాత్మక డీప్ సీ పోర్టును భారత్, జపాన్ లకు ఆఫర్ చేసిన శ్రీలంక

  • శ్రీలంకలో పోర్టును అభివృద్ధి చేసిన చైనా
  • ఇతర దేశాలతోనూ సంబంధాలు పెంచుకోవాలనుకుంటున్న లంక
  • చైనా పోర్టుకు ఆవల మరో పోర్టు ప్రతిపాదన
  • 85 శాతం వాటాల కేటాయింపుకు సమ్మతి
భారత్ పొరుగునే ఉన్న శ్రీలంక కొన్నాళ్లుగా చైనాకు దగ్గరవుతున్నట్టు అనేక పరిణామాలు సూచిస్తున్న విషయం తెలిసిందే. శ్రీలంకలోని ఓ పోర్టును చైనా అభివృద్ధి చేస్తుండడంతో పాటు, అనేక రంగాల్లో చైనా పెట్టుబడులు పెడుతోంది. అయితే, చైనా కారణంగా ఇతర దేశాలతో తనకు దూరం పెరుగుతోందని గుర్తించిన శ్రీలంక దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఇతర దేశాలతోనూ సమ రీతిలో సంబంధాలు కొనసాగించాలని నిర్ణయించింది.

ఈ క్రమంలో, తన తీరప్రాంతంలోని వ్యూహాత్మకమైన ఓ డీప్ సీ పోర్టును ఉపయోగించుకోవచ్చంటూ భారత్, జపాన్ లకు తాజాగా ప్రతిపాదించింది. అంతకుముందు, పాక్షికంగా నిర్మాణం జరుపుకున్న తూర్పు కంటైనర్ టెర్మినల్ ను అప్పగిస్తామని భారత్, జపాన్ లతో శ్రీలంక గతనెలలో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ తూర్పు కంటైనర్ టెర్మినల్ కొలంబో తీరప్రాంతం సమీపంలో చైనా నిర్వహిస్తున్న కంటైనర్ టెర్మినల్ కు సమీపంలోనే ఉంది.

అయితే, చైనా నిర్వహిస్తున్న కంటైనర్ కు అవతలి వైపున ఉన్న పశ్చిమ కంటైనర్ టెర్మినల్ ను భారత్, జపాన్ లకు ఇస్తామని శ్రీలంక కొత్త ప్రతిపాదన చేసింది. ఈ టెర్మినల్ ఇంకా నిర్మాణం జరుపుకోవాల్సి ఉంది. ఈ ఒప్పందం కార్యరూపం దాల్చితే భారత్, జపాన్ దేశాలకు ఈ టెర్మినల్ లో 85 శాతం వాటాలు కేటాయిస్తారు. గతంలో చైనాకు కూడా ఇదే మొత్తంలో వాటాలు కేటాయించినట్టు లంక అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా, ఈ ప్రతిపాదనకు కొలంబోలోని భారత హైకమిషన్ ఆమోదం తెలుపగా, జపాన్ నుంచి స్పందన రావాల్సి ఉంది.


More Telugu News