సీరం ఇన్ స్టిట్యూట్, భారత్ బయోటెక్ పై కన్నేసిన చైనా హ్యాకర్లు

  • కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న సీరం
  • వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్
  • కీలక సమాచారం కోసం ఈ రెండు సంస్థలపై హ్యాకర్ల దాడులు
  • చైనా ప్రభుత్వ హ్యాకర్ల పనే అంటున్న సైబర్ నిఘా సంస్థ సైఫర్మా
కరోనాతో తల్లడిల్లుతున్న ప్రపంచానికి ఊరట కలిగించేలా సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా భారీ ఎత్తున కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి చేపట్టగా, దేశీయంగా కరోనా వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్ భారత కీర్తిపతాకను అంతర్జాతీయంగా రెపరెపలాడిస్తోంది. అయితే ఇప్పుడీ రెండు సంస్థలపై చైనా హ్యాకర్లు కన్నేశారన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.

కరోనా వ్యాక్సిన్లకు సంబంధించిన అత్యంత కీలక సమాచారం ఈ రెండు సంస్థల వద్ద ఉంది. ఈ నేపథ్యంలో... సీరం, భారత్ బయోటెక్ కంప్యూటర్ వ్యవస్థలను లక్ష్యంగా చైనా ప్రభుత్వ మద్దతు కలిగివున్న హ్యాకర్ల బృందం ఇటీవల దాడులకు పాల్పడిందని సైఫర్మా అనే సైబర్ ఇంటెలిజెన్స్ సంస్థ వెల్లడించింది. చైనాకు చెందిన ఏటీపీ10 లేక స్టోన్ పాండా అనే హ్యాకర్ల గ్రూపు భారత్ బయోటెక్, సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఐటీ మౌలిక సదుపాయాలు, సప్లై చైన్ సాఫ్ట్ వేర్ల లోని లొసుగులను గుర్తించిందని సైఫర్మా వివరించింది.

ఆయా సంస్థలకు చెందిన మేధోపరమైన సమాచారాన్ని తొలగించడం, తద్వారా వ్యాక్సిన్ రంగంలో దూసుకుపోతున్న ఆ భారత ఫార్మా సంస్థలపై పైచేయి సాధించడమే ఈ హ్యాకర్ల దాడుల వెనుక ప్రధాన ఉద్దేశమని సైఫర్మా సీఈవో కుమార్ రితేశ్ వెల్లడించారు. కుమార్ గతంలో బ్రిటన్ నిఘా సంస్థ ఎంఐ6లో అత్యున్నత సైబర్ నిపుణుడిగా సేవలు అందించారు. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేస్తున్న సీరం సంస్థనే చైనా హ్యాకర్ల బృందం ఏపీటీ10 ఎక్కువగా టార్గెట్ చేస్తోందని వివరించారు.

కాగా, చైనా ప్రభుత్వ అధీనంలోని హ్యాకింగ్ బృందంపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, భారత మీడియా చైనా విదేశాంగశాఖను వివరణ కోరగా, ఎలాంటి స్పందన రాలేదు. అటు సీరం, భారత్ బయోటెక్ కూడా దీనిపై మాట్లాడేందుకు నిరాకరించాయి.


More Telugu News