చంద్రబాబుకు విమాన టికెట్లను బుక్ చేసిన పోలీసులు

  • రేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు
  • నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్న చంద్రబాబు
  • హైదరాబాదుకు పంపించేందుకు యత్నిస్తున్న పోలీసులు
రేణిగుంట విమానాశ్రయంలో టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. కరోనా నిబంధనలు, ఎన్నికల కోడ్ నేపథ్యంలో చంద్రబాబు చేపట్టాలనుకున్న దీక్షకు అనుమతించలేమని పోలీసులు స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలను కలిసేందుకైనా తనను పంపించాలని చంద్రబాబు కోరినా పోలీసులు ఆయనను పంపించలేదు. దీంతో, విమానాశ్రయంలోనే నేలపై బైఠాయించి ఆయన నిరసన వ్యక్తం చేస్తున్నారు. గంటలు గడుస్తున్నా తన నిరసన కార్యక్రమాన్ని ఆయన విరమించలేదు.

మరోవైపు ఆయనను హైదరాబాదుకు పంపించేందుకు పోలీసులు విమాన టికెట్లను బుక్ చేశారు. మధ్యాహ్నం 3.10 గంటలకు స్పైస్ జెట్ విమానంలో పంపించేందుకు వారు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తాను అక్కడి నుంచి కదిలేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. దీంతో సాయంత్రం 7.15 గంటలకు ఇండిగో విమానంలో పంపించేందుకు మరోసారి పోలీసులు టికెట్లను బుక్  చేశారు.  

ఈ ఘటనపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందిస్తూ, కరోనా ఆంక్షలు, కోవిడ్ వల్లే చంద్రబాబును పోలీసులు విమానాశ్రయంలోనే ఆపేశారని తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో తిరుపతి పర్యటన కుదరదని ఆయనకు పోలీసులు ముందే చెప్పారని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదనే విషయం చంద్రబాబుకు తెలుసని... అయినా, శాంతిభద్రతల సమస్యను సృష్టించి, ప్రజలను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు.


More Telugu News