పోలవరం వద్ద వైఎస్సార్ విగ్రహం, వైఎస్సార్ గార్డెన్స్ ఏర్పాటుపై సీఎం జగన్ సమీక్ష

  • పోలవరం జి-హిల్ సైట్ వద్ద వైఎస్ విగ్రహం
  • 100 అడుగుల ఎత్తుతో భారీ విగ్రహం
  • అక్కడే గార్డెన్స్ కూడా ఏర్పాటు
  • పర్యావరణానికి ఇబ్బంది లేకుండా చూడాలన్న సీఎం
  • నిర్వహణ వ్యయం తక్కువగా ఉండేలా డిజైన్లు ఉండాలని సూచన
పోలవరం ప్రాజెక్టు పనులపై సీఎం జగన్ ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. మే నెల చివరికల్లా కాఫర్ డ్యాం పూర్తి కావాలని, స్పిల్ వే, ఆప్రోచ్ చానల్ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ పనులు పూర్తయ్యే లోపు కాఫర్ డ్యాంలో అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

కాగా, ఈ సమీక్ష సందర్భంగా పోలవరం ప్రాజెక్టు వద్ద వైఎస్సార్ 100 అడుగుల విగ్రహం, వైఎస్సార్ గార్డెన్స్ ఏర్పాటు అంశాలను కూడా సీఎం అధికారులతో సమీక్షించారు. పోలవరం వద్ద జి-హిల్ సైట్ వద్ద ఏర్పాటు చేయదలిచిన వైఎస్సార్ విగ్రహం, గార్డెన్స్ అంశాలకు చెందిన ప్రతిపాదనలను అధికారులు సీఎంకు వివరించారు. ఈ అంశాలపై అధికారులకు సీఎం జగన్ పలు సూచనలు చేశారు.

కాలక్రమంలో గార్డెన్స్ మరింత రమణీయంగా రూపుదిద్దుకునేలా చర్యలు ఉండాలని, అదే సమయంలో పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులు లేని విధంగా డిజైన్లు ఉండాలని స్పష్టం చేశారు. ప్రకృతి సమతుల్యతకు పెద్దపీట వేయాలని వివరించారు. అంతేకాకుండా, నిర్వహణ వ్యయం బాగా తక్కువగా ఉండే విధంగా నిర్మాణ రీతులు ఉండాలని పేర్కొన్నారు.


More Telugu News