ఎస్ఈసీ మొక్కుబడిగా సమావేశం ఏర్పాటు చేసినట్టు అనిపిస్తోంది: వర్ల రామయ్య

  • అఖిలపక్ష నేతలతో ఎస్ఈసీ సమావేశం
  • హాజరైన వర్ల రామయ్య
  • ఎస్ఈసీ తీరు సందేహాలకు తావిస్తోందని వ్యాఖ్యలు
  • మాట్లాడేందుకు ఐదు నిమిషాల సమయమిచ్చారని వెల్లడి
  • ఎస్ఈసీ చిత్తశుద్ధితో వ్యవహరించాలని కోరామని వివరణ
రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రాయయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇవాళ ఎస్ఈసీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం ఏదో మొక్కుబడి తంతులా జరిగిందని విమర్శించారు. తమకు మాట్లాడేందుకు కేవలం ఐదు నిమిషాల సమయం మాత్రమే ఇచ్చారని వెల్లడించారు. ఎస్ఈసీ తీరు చూస్తుంటే సందేహాస్పదంగా ఉందన్నారు.

ఇటీవల ముగిసిన నాలుగు విడతల పంచాయతీ ఎన్నికల్లో దాడులు, అక్రమాలు జరిగాయని ఎస్ఈసీకి వివరించాలని ప్రయత్నిస్తే, ఆయన వినేందుకు ఆసక్తి చూపించలేదని అన్నారు. రీకౌంటింగ్, తదితర అంశాలపై ఏం చర్యలు తీసుకున్నారని అడిగితే మౌనమే సమాధానం అయిందని తెలిపారు. కొన్ని అంశాలు అడగకూడదన్నట్టుగా వ్యవహరించారని వర్ల రామయ్య ఆరోపించారు. ఎస్ఈసీ తీరు దుర్మార్గం అని విమర్శించారు. ఈ సందర్భంగా, ఎస్ఈసీ చిత్తశుద్ధితో వ్యవహరించాలని టీడీపీ తరఫున కోరామని స్పష్టం చేశారు.


More Telugu News