సామాన్యుడికి మ‌రో షాక్‌.. గ్యాస్ సిలిండ‌ర్ల ధ‌ర‌ల పెంపు

  • వంటగ్యాస్‌పై రూ.25 పెంపు
  • వాణిజ్య సిలిండర్‌పై రూ.95 పెరుగుద‌ల‌
  • వెంట‌నే అమ‌ల్లోకి ధ‌ర‌లు
  • ఢిల్లీలో వంట‌గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.819కి చేరిన వైనం
సామాన్యుడికి వంట గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌ల పెంపు రూపంలో మ‌రో షాక్ త‌గిలింది. అంతేగాక‌, ఈ సారి వంట గ్యాస్ సిలిండ‌ర్ల ధ‌ర‌లే కాకుండా వాణిజ్య గ్యాస్ సిలిండ‌ర్ల ధ‌ర‌లు కూడా పెరిగాయి.

వంటగ్యాస్‌పై రూ.25, వాణిజ్య సిలిండర్‌పై రూ.95ను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణ‌యం తీసుకున్నాయి. ఈ ధ‌ర‌లు వెంట‌నే అమ‌ల్లోకి వ‌చ్చాయి. ఈ నెల 25వ తేదీన‌ వంట‌గ్యాస్ సిలిండ‌ర్‌పై రూ.25 పెంచిన విష‌యం తెలిసిందే.

అనంత‌రం‌ 4వ తేదీన సిలిండ‌ర్‌పై రూ.25 పెరిగింది. ఆ త‌ర్వాత 15వ తేదీన మ‌రో రూ.50 పెరిగింది. నాలుగుసార్లు గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌లను పెంచడంలో ఈ నెల‌లో మొత్తం రూ.125 పెరిగిన‌ట్ల‌యింది. అలాగే, మూడు నెలల వ్యవధిలో గ్యాస్‌ బండపై రూ.225 పెరిగింది.

గత ఏడాది డిసెంబరు‌ 1న సిలిండర్‌ ధర రూ.594 నుంచి రూ.644కి పెంచారు. ఆ తర్వాత జనవరి 1న రూ.644 నుంచి రూ.694కు పెంచారు. ఈ నెల  4న ధ‌ర‌ రూ.719కి చేరింది. 15న   రూ.769 చేరింది. 25న మ‌రో 25 రూపాయ‌లు, ఈ రోజు మ‌రో రూ.25 పెంపుతో ఢిల్లీలో సిలిండర్‌ ధర రూ.819కి చేరింది. ఇక వాణిజ్య సిలిండర్‌పైనా ఈ రోజు రూ.95 పెరగడంతో, సిలిండర్‌ ధర రూ.1,614కు చేరింది.


More Telugu News