మోడల్ ఆత్మహత్యపై ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర మంత్రి సంజయ్ రాథోడ్ రాజీనామా

  • ఫిబ్రవరి 8న పూజా చవాన్ అనే మోడల్ ఆత్మహత్య
  • బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన పూజా
  • మంత్రి సంజయ్ రాథోడే కారణమంటున్న బీజేపీ
  • భార్యతో కలిసి సీఎం ఉద్ధవ్ థాకరేతో సమావేశమైన రాథోడ్
  • అనంతరం రాజీనామా చేస్తున్నట్టు ప్రకటన
మోడల్, టిక్ టాక్ స్టార్ పూజ చవాన్ (22) ఇటీవల ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర మంత్రి, శివసేన నేత సంజయ్ రాథోడ్ (49) పదవికి రాజీనామా చేశారు. సంజయ్ రాథోడ్ ఈ మధ్యాహ్నం తన భార్యతో కలిసి సీఎం ఉద్ధవ్ థాకరేతో సమావేశమయ్యారు. సీఎంతో చర్చించిన అనంతరం తాను పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.

పూజా చవాన్ ఈ నెల 8న పుణేలో ఓ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఆమె మృతికి మంత్రి సంజయ్ రాథోడే కారణమని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై రాథోడ్ స్పందిస్తూ, తన రాజకీయ జీవితాన్ని నాశనం చేయడానికి విపక్ష బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

బంజారా సామాజిక వర్గానికి చెందిన ఓ యువతి దురదృష్టకర రీతిలో చనిపోతే, ఆ ఘటనతో లబ్ది పొందాలని బీజేపీ చూస్తోందని విమర్శించారు. సీఎంకు రాజీనామా లేఖ అందించానని, నిజానిజాలేంటో దర్యాప్తులో వెల్లడవుతాయని ధీమా వ్యక్తం చేశారు. అయితే తాను మంత్రిగానే తప్పుకున్నానని, ఎమ్మెల్యేగా కాదని రాథోడ్ స్పష్టం చేశారు.


More Telugu News