బస్సు డ్రైవర్లుగా ఉపాధి పొందుతున్న మాజీ క్రికెటర్లు

  • ఆదాయం కోసం భిన్న మార్గాల్లో క్రికెటర్లు
  • ఆస్ట్రేలియాలో బస్సులు నడుపుతున్న లంక, జింబాబ్వే క్రికెటర్లు
  • గతంలో జాతీయ జట్లకు ప్రాతినిధ్యం వహించిన వైనం
  • ట్రాన్స్ డెవ్ సంస్థలో ఉపాధి
భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి కొన్ని దేశాల్లో మినహాయిస్తే క్రికెటర్ల పరిస్థితి కొన్ని సందర్భాల్లో దుర్భరం అని చెప్పాలి. మ్యాచ్ లు ఆడే సమయంలోనే ఏమంత గొప్ప పారితోషికాలు అందుకోని ఆ క్రికెటర్లు రిటైర్మెంట్ తర్వాత ఎన్నో కష్టాలు పడుతుంటారు. గతంలో ఓ పాక్ క్రికెటర్ ఆస్ట్రేలియాలో క్యాబ్ డ్రైవర్ అవతారం ఎత్తితే అందరూ ఆశ్చర్యపోయారు. తాజాగా శ్రీలంక, జింబాబ్వేకు చెందిన మాజీ ఆటగాళ్లు కూడా అదే బాటలో ఆస్ట్రేలియాలో బస్సు డ్రైవర్లుగా ఉపాధి పొందుతున్నారు.

శ్రీలంక జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సూరజ్ రణదివ్, చింతక జయసింఘే, జింబాబ్వే మాజీ ఆటగాడు వాడింగ్టన్ ఎంవాయెంగా మెల్బోర్న్ నగరంలో ట్రాన్స్ డెవ్ అనే ఫ్రెంచ్ కంపెనీకి చెందిన బస్సులు నడుపుతున్నారు. ట్రాన్స్ డెవ్ సంస్థ విభిన్న రంగాలకు చెందిన దాదాపు 1,200 మందిని డ్రైవర్లుగా నియమించుకుంది. వారిలో ఈ ముగ్గురు క్రికెటర్లు కూడా ఉన్నారు. ప్రస్తుతం వారు మెల్బోర్న్ లో స్థానికంగా ఓ క్లబ్ తరఫున క్రికెట్ ఆడుతూనే, ఇటు బస్సు డ్రైవర్లుగానూ వ్యవహరిస్తున్నారు.

36 ఏళ్ల సూరజ్ రణదివ్ ఆఫ్ స్పిన్ బౌలర్. శ్రీలంక జట్టు తరఫున 12 టెస్టులు, 31 వన్డేలు, 7 అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లు ఆడాడు. రణదివ్ టెస్టుల్లో 43 వికెట్లు తీశాడు. వాటిలో 5 వికెట్ల ప్రదర్శన ఒకసారి నమోదు చేశాడు. 4 వికెట్ల ప్రదర్శన మూడు సార్లు నమోదు చేశాడు.

ఇక చింతక జయసింఘే శ్రీలంక జట్టు తరఫున 5 అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ల్లో ప్రాతినిధ్యం వహించాడు. 2009లో టీమిండియాతో మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు.

జింబాబ్వేకు చెందిన వాడింగ్టన్ ఎంవాయెంగా 2005-06 సీజన్ లో ఒక టెస్టు, 3 వన్డేల్లో జాతీయ జట్టుకు ఆడాడు.


More Telugu News