కోటప్పకొండ తిరునాళ్లలో ప్రభలు కట్టవద్దని మేం ఆంక్షలు విధించలేదు: ఎస్పీ విశాల్ గున్నీ

  • ప్రభల అంశంలో నిన్న లోకేశ్ వ్యాఖ్యలు
  • స్పందించిన గుంటూరు రూరల్ ఎస్పీ
  • సంప్రదాయ ప్రభలపై ఆంక్షలు లేవని స్పష్టీకరణ
  • కరోనా నిబంధనలు పాటించాలని సూచన
  • మతాచారాలపై అవాస్తవాలు ప్రచారం చేయొద్దని వెల్లడి
శివరాత్రి సందర్భంగా గుంటూరు జిల్లా కోటప్పకొండ తిరునాళ్లలో ప్రభలు కట్టవద్దని పోలీసులు హెచ్చరించడం దారుణమని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ నిన్న వ్యాఖ్యానించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ స్పందించారు. కోటప్పకొండ తిరునాళ్లలో ప్రభలు కట్టవద్దని తాము ఆంక్షలు విధించలేదని స్పష్టం చేశారు. సంప్రదాయ ప్రభలపై ఎలాంటి ఆంక్షలు లేవని తెలిపారు.

మున్సిపల్ ఎన్నికల వేళ శాంతిభద్రతకు విఘాతం లేకుండా జాగ్రత్తలు చేపట్టాలని పేర్కొన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తిరునాళ్ల జరుపుకోవచ్చని ఎస్పీ స్పష్టం చేశారు. మతాచారాలకు సంబంధించిన అవాస్తవాలను ఎవరూ ప్రచారం చేయొద్దని హితవు పలికారు. ఏపీలో మార్చి 10న పురపాలక ఎన్నికలు జరగనుండగా ఆ మరుసటి రోజే శివరాత్రి పర్వదినం జరుపుకోనున్నారు.


More Telugu News