పూణెలో స్కూళ్లు, కాలేజీలు మార్చి 14 దాకా బంద్​

  • ప్రకటించిన నగర మేయర్ మురళీధర్
  • కరోనా కేసులు పెరుగుతుండడంతో నిర్ణయం
  • రాత్రి కర్ఫ్యూ కొనసాగుతుందని వెల్లడి
  • రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల దాకా అత్యవసరాలకే అనుమతి
దేశంలోని దాదాపు అన్ని చోట్ల స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు తెరుచుకున్నా.. మహారాష్ట్రలోని పుణేకి మాత్రం ఆ భాగ్యం ఇంకా కలగడం లేదు. కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడం, తీవ్రత ఎక్కువగా ఉండడంతో మార్చి 14 దాకా స్కూళ్లు తెరవొద్దని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు, ఇతర విద్యాసంస్థలన్నీ మార్చి 14 దాకా మూసే ఉంటాయని పూణే మేయర్ మురళీధర్ మోహోల్ ప్రకటించారు.

రాత్రి కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. అత్యవసరాలు, నిత్యవసరాలు తప్ప వేరే దేనికీ రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అనుమతినివ్వబోమని మేయర్ తేల్చి చెప్పారు. ఈ మేరకు ఫిబ్రవరి 28 వరకు ప్రకటించిన నిబంధనలను పొడిగిస్తున్నట్టు ప్రకటించారు.

వాస్తవానికి చాలా నెలల పాటు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించిన తర్వాత పూణెలో స్కూళ్లను జనవరిలో తెరిచారు. స్కూళ్లకు వచ్చే ముందు విద్యార్థులు, టీచర్లు విధిగా ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఆ మేరకు జనవరిలో పాఠశాలలు, కాలేజీలను తెరిచారు. కానీ, కేసులు మళ్లీ పెరుగుతుండడంతో ఫిబ్రవరిలో మూసేశారు. ఆ నిబంధనలను ఇప్పుడు పొడిగించారు. కాగా, ఆదివారం ఒక్కరోజే మహారాష్ట్రలో 8,623 కొత్త కేసులు నమోదు కాగా.. పూణెలో వెయ్యికిపైగా రికార్డ్ అయ్యాయి.


More Telugu News