ఎన్నిక‌ల నేప‌థ్యంలో దాడుల‌కు పాల్ప‌డుతున్నారు: చ‌ంద్ర‌బాబు ఆగ్ర‌హం

  • మా పార్టీతో పోటీ పడలేకే ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు
  • అభ్యర్థులను భయపెట్టి ల‌బ్ధి పొందాలనుకుంటున్నారు
  • ప్ర‌జాస్వామ్యాన్ని జ‌గ‌న్ కాల‌రాస్తున్నారు
మునిసిప‌ల్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో వైసీపీ నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తోన్న తీరుపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ రోజు అమ‌రావ‌తిలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... ఈ  ఎన్నికల్లో త‌మ‌ పార్టీతో పోటీ పడలేకే వైసీపీ నేత‌లు ఆస్తుల విధ్వంసానికి పాల్ప‌డుతున్నార‌ని ఆయ‌న ఆరోపించారు.

త‌మ పార్టీ అభ్యర్థులను భయపెట్టి ల‌బ్ధి పొందాల‌ని వైసీపీ ప్ర‌య‌త్నాలు జ‌రుపుతోంద‌ని ఆయ‌న తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని జ‌గ‌న్ కాల‌రాస్తున్నార‌ని, ఎన్నికల ప్రక్రియను అప‌హాస్యం చేసేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మండిప‌డ్డారు. తిరుపతిలో టీ కొట్టు నిర్వాహ‌కుడు శ్రీనివాసులు షాపును వైసీపీ నేత‌లు అక్రమంగా తొలగించార‌ని ఆయ‌న తెలిపారు. అలాగే, పలాసలో టీడీపీ అభ్య‌ర్థుల‌ను వైసీపీ నేత‌లు బెదిరింపులకు గురి చేస్తున్నార‌ని చెప్పారు.

త‌మ అభ్య‌ర్థుల‌ను వైసీపీలో చేర్చుకుంటున్నార‌ని తెలిపారు.  సీఎం ఆదేశాల మేర‌కే రాష్ట్రంలో వైసీపీ నేత‌లు ఇటువంటి చ‌ర్య‌లకు పాల్ప‌డుతున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. వైసీపీ పాల్ప‌డుతున్న అక్ర‌మాల‌పై రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ఎందుకు స్పందించడం లేదని చంద్ర‌బాబు నిల‌దీశారు. ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఎస్ఈసీ, పోలీసులు ర‌క్ష‌ణ క‌ల్పించాల్సి ఉంటుంద‌ని చెప్పారు.




More Telugu News