పడిన చోటే.. పడిన వెంటనే.. వాన నీటిని పట్టేద్దాం: ప్రధాని మోదీ

  • వాన నీటి సంరక్షణపై మన్ కీ బాత్ లో దేశ ప్రజలకు ప్రధాని సందేశం
  • త్వరలోనే జలశక్తి శాఖ కార్యక్రమం ప్రారంభిస్తుందని వెల్లడి
  • ఇప్పటి నుంచే జలవనరులను శుభ్రం చేసుకుందామని పిలుపు
  • తెలుగు వారి గురించి ప్రస్తావించిన ప్రధానమంత్రి
రాబోయే రోజులు అత్యంత కఠినంగా ఉంటాయని, భవిష్యత్తులో చాలా మందికి నీరు అందని పరిస్థితులు ఏర్పడతాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అలాంటి పరిస్థితుల నుంచి బయటపడాలంటే ఇప్పటి నుంచే జల సంరక్షణ చేయాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో వాన నీటి సంరక్షణ గురించి ఆయన మాట్లాడారు.

కలిసికట్టుగా వాన నీటిని ఒడిసిపట్టాలని పిలుపునిచ్చారు. దేశంలో జూన్ నుంచి వర్షాలు మొదలవుతాయని, ఆ లోపే వాన నీటిని ఒడిసిపట్టే కార్యక్రమాలను మొదలు పెట్టాలని సూచించారు. కుంటలు, చెరువులు, బావుల వంటి జలవనరులను శుభ్రం చేయడం, వాటి పూడిక తీయడం వంటి కార్యక్రమాలను చేపట్టడం ద్వారా వాన నీటిని ఎక్కువగా నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందని, ఆ దిశగా వంద రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించాలని అన్నారు. త్వరలోనే కేంద్ర జల శక్తి శాఖ ‘పడిన చోటే.. పడిన వెంటనే.. వాన నీటిని ఒడిసి పడదాం (క్యాచ్ ద రెయిన్)’ అనే నినాదంతో ఓ మంచి కార్యక్రమాన్ని ప్రారంభించబోతోందన్నారు.

ప్రస్తుతం ఉన్న ఇంకుడు గుంతలను బాగు చేయాలని, జలవనరుల్లోకి వాన నీరు వెళ్లే మార్గాలను శభ్రం చేయాలని ప్రధాని సూచించారు. వీలైనంత ఎక్కువగా వాన నీటిని ఒడిసి పట్టేందుకు ప్రయత్నించాలని చెప్పారు. నీరు, నదులతో ముడిపడి ఉన్న మాఘ పూర్ణిమ గురించి చెప్పుకొచ్చారు. ప్రపంచంలోని ప్రతి సమాజం, ప్రతి మతానికీ నదులతో ఏదో ఓ అనుబంధం ముడిపడి ఉందని చెప్పారు. నదుల వెంటనే ఎన్నెన్నో నాగరికతలు విలసిల్లాయని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరికీ నీరు జీవనాధారమన్నారు.  

దేశం గర్వించదగిన శాస్త్రవేత్త సర్ సీవీ రామన్ కనిపెట్టిన రామన్ ఎఫెక్ట్ తో సైన్స్ గతే మారిపోయిందని, ఈ రోజు జాతీయ సైన్స్ దినోత్సవమని ప్రధాని గుర్తు చేశారు. సైన్స్ గురించి మాట్లాడినప్పుడల్లా అందరూ ఫిజిక్స్ (భౌతిక శాస్త్రం), కెమిస్ట్రీ (రసాయన శాస్త్రం) దగ్గరే ఆగిపోతుంటారని, వాటి గురించే మాట్లాడతారని అన్నారు.

కానీ, సైన్స్ అంటే అంత క న్నా ఎక్కువేనని ఆయన చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్ లో సైన్స్ పాత్ర చాలా కీలకమన్నారు. ల్యాబ్ టు ల్యాండ్ (ప్రయోగ శాల నుంచి నేలకు) అనేంతగా సైన్స్ ను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. నేడు ఆత్మనిర్భర్ భారత్ అనేది ప్రతి ఒక్కరి మనసుల్లోకి వెళ్లిందని, అదో సెంటిమెంట్ గా మారిందని అన్నారు.

తెలుగు రైతు చేసి చూపించారు..
 
హైదరాబాద్ కు చెందిన చింతల వెంకట్ రెడ్డి అనే రైతు గురించి ప్రధాని ప్రస్తావించారు. ఆయనను కొనియాడారు. ‘‘ఓ రోజు వెంకట్ రెడ్డికి స్నేహితుడైన ఓ డాక్టర్.. విటమిన్ డీ లోపంతో ఎలాంటి జబ్బులు వస్తున్నాయో, దానితో ఉన్న ప్రమాదమేంటో వెంకట్ రెడ్డికి చెప్పారు. అప్పుడే రైతు అయిన వెంకట్ రెడ్డి.. ఆ సమస్యను ఎలా తీర్చాలని ఆలోచించారు. ఎన్నో కష్టనష్టాలకోర్చి విటమిన్ డీ కలిగిన వరి, గోధుమలను ఆయన పండించారు. ఈ నెలలోనే ఆయన పంటకు జెనీవాలోని ప్రపంచ మేధో హక్కుల సంస్థ.. పేటెంట్ హక్కులు కూడా ఇచ్చింది. అలాంటి వ్యక్తికి గత ఏడాది పద్మ శ్రీ పురస్కారం ఇవ్వడం మా ప్రభుత్వానికి దక్కిన గౌరవం’’ అని ప్రధాని కొనియాడారు.      

హైదరాబాద్ అమ్మాయి ప్రశ్న ఆలోచనలో పడేసింది..

దేశంలో ఎన్నో భాషలున్నాయని, ఆ భాషలే మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని ప్రధాని అన్నారు. హైదరాబాద్ కు చెందిన అపర్ణా రెడ్డి అనే మహిళ తనను ఓ ప్రశ్న అడిగారని, చిన్న ప్రశ్నే అయినా అది తనను ఆలోచింపజేసిందని అన్నారు. ‘‘మీరు ఇన్నేళ్లు ప్రధానిగా ఉన్నారు. చాలా సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇన్నేళ్లలో ఇది చేయలేకపోయానే అని మీకు అనిపించలేదా? అలాంటి సందర్భాలేంటి?’’ అని అపర్ణ అడిగిందన్నారు. ఆ ప్రశ్న తనను ఆలోచనలో పడేసిందని, ప్రపంచంలోనే చాలా పురాతన భాషగా పేరున్న తమిళం నేర్చుకోలేకపోయానే అని అనిపించిందన్నారు.  

వర్రీయర్స్ లా కాదు.. వారియర్స్ లా ఉండాలి

త్వరలోనే పరీక్షలు రాబోతున్నాయని మోదీ గుర్తు చేశారు. చాలా మంది యువ మిత్రుల జీవితాలకు అవి చాలామముఖ్యమైనవన్నారు. పరీక్షలు అనగానే ఆందోళన పడిపోవద్దని సూచించారు. వర్రీయర్ (ఆందోళన పడిపోవడం)లా కాకుండా వారియర్ (యోధుడు) లాగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. పరీక్షలకు సంతోషంగా వెళ్లి.. లాభంగా తిరిగి రావాలన్నారు. ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాదీ పరీక్షా పే చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, టీచర్లు మైగవ్ వెబ్ సైట్ లేదా నరేంద్ర మోదీ యాప్ లో అనుభవాలు పంచుకోవాలని సూచించారు.


More Telugu News