జుట్టు పట్టి ఈడ్చుకెళ్లారు.. నడవలేనంతగా హింసించారు: నొదీప్​ కౌర్​

  • బెయిల్ పై విడుదలైన కార్మిక హక్కుల కార్యకర్త
  • పోలీసులు బలవంతంగా పేపర్లపై సంతకం చేయించారని ఆరోపణ
  • కనీసం నడవలేకపోతున్నానని బెయిల్ పేపర్లలో వెల్లడి
పోలీసులు తనను తీవ్రంగా హింసించారని, కనీసం మహిళా పోలీసులు లేకుండానే అరెస్ట్ చేశారని కార్మిక హక్కుల కార్యకర్త నొదీప్ కౌర్ ఆరోపించారు. పంజాబ్ హర్యానా హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆమె విడుదలయ్యారు. హర్యానాలోని సోనిపట్ పోలీసులు తనను జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లారని, ఇష్టమొచ్చినట్టు కొట్టారని బెయిల్ పిటిషన్ లో ఆరోపించారు. దీంతో ఒంటి మీద గాయాలయ్యాయని చెప్పారు.

తానేమీ తప్పు చేయలేదని, తనకు వ్యతిరేకంగా పోలీసుల వద్ద ఎలాంటి ఆధారాలూ లేవని అన్నారు. ‘‘నన్ను తిట్టారు. కొట్టారు. బలవంతంగా ఏవో పేపర్లపై సంతకం చేయించుకున్నారు. నేనిప్పుడు కనీసం నడవలేని స్థితిలో ఉన్నాను. అంతలా హింసించారు’’ అని ఆరోపించారు. అయితే నొదీప్ కౌర్ ఆరోపణలను పోలీసులు ఖండించారు. ఆమె ఆరోపణలకు ఆధారాల్లేవన్నారు.

ఓ పరిశ్రమ యాజమాన్యాన్ని ఘెరావ్ చేసి అక్రమంగా వసూళ్లకు పాల్పడిందని, పోలీసులపై హత్యాయత్నం చేసిందన్న ఆరోపణలతో నొదీప్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. జనవరి 12న అరెస్ట్ చేశారు.
 
కాగా, మరో కార్యకర్త శివకుమార్ నూ పోలీసులు హింసించినట్టు చండీగఢ్ లోని ప్రభుత్వ వైద్య కళాశాల నివేదిక చెబుతోంది. ఎముకలు విరిగాయని పేర్కొంది. ఎడమ చేయి, కుడి పాదంపై తీవ్రమైన గాయాలున్నట్టు పేర్కొంది. ‘‘కుడి పాదం బాగా వాచింది. ఎడమ పాదం బొటన వేలు గోర్లు విరిగిపోయి ఉన్నాయి. కుడిపాదంలోని రెండో వేలు, మూడో వేలు విరిగాయి’’ అని నివేదిక వెల్లడించింది.


More Telugu News