ఐపీఎల్ వేదికల జాబితాలో హైదరాబాదుకు దక్కని స్థానం!

  • గత సీజన్ ను యూఏఈలో నిర్వహించిన బీసీసీఐ
  • తాజా ఐపీఎల్ సీజన్ భారత్ లో నిర్వహణ
  • పరిమిత వేదికల్లోనే మ్యాచ్ లు
  • బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, కోల్ కతా, అహ్మదాబాద్ లో పోటీలు
  • ముంబయి వేదికపై మహా సర్కారు అనుమతి కోసం చూస్తున్న బోర్డు
గత సీజన్ ఐపీఎల్ పోటీలను యూఏఈ గడ్డపై నిర్వహించిన బీసీసీఐ రాబోయే సీజన్ ను భారత్ లోనే నిర్వహించాలని నిర్ణయించింది. అయితే, కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని యూఏఈ తరహాలోనే పరిమిత వేదికల్లో మ్యాచ్ లు జరపాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఎంపిక చేసిన వేదికల జాబితాలో హైదరాబాద్ కు స్థానం దక్కలేదు. ఇప్పటివరకైతే బెంగళూరు, కోల్ కతా, ఢిల్లీ, అహ్మదాబాద్, చెన్నై నగరాలను మాత్రమే ఎంపిక చేశారు.

కరోనాతో ఇప్పటికీ సతమతమవుతున్న ముంబయిని కూడా వేదికగా ఎంపిక చేయాలని భావించినా, అందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంది. ఒకవేళ మహారాష్ట్ర సర్కారు అనుమతి నిరాకరిస్తే, ప్రత్యామ్నాయ వేదికగా హైదరాబాదును ఎంచుకునే అవకాశముంది.

ఇటీవలే ఓపెనింగ్ జరుపుకున్న మొతేరాలోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలోనూ ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహించేందుకు బీసీసీఐ నిశ్చయించింది. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ స్టేడియంలో ఐపీఎల్ పోటీలు నిర్వహిస్తే లీగ్ మరింత ఆకర్షణీయంగా మారుతుందని బోర్డు భావిస్తోంది.


More Telugu News