కోటప్పకొండ తిరునాళ్లకు ప్రభలు కట్టొద్దని పోలీసులు హెచ్చరించడం విచారకరం: నారా లోకేశ్

  • శివరాత్రికి ముస్తాబవుతున్న కోటప్పకొండ
  • ప్రభలు కట్టడాన్ని అడ్డుకుంటున్నారన్న లోకేశ్
  • ఇది అపచారం అని వెల్లడి
  • ప్రభలు పల్లెల నుంచే బయల్దేరతాయని వివరణ
గుంటూరు జిల్లా కోటప్పకొండ పుణ్యక్షేత్రంలో శివరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. శివరాత్రి సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసే ప్రభలు శోభాయమానంగా ఉంటాయి. అయితే, ఎన్నికల కోడ్, కరోనా మార్గదర్శకాల కారణంగా కోటప్పకొండ తిరునాళ్లకు ప్రభలు కట్టొద్దని పోలీసులు హెచ్చరించడం చాలా విచారకరమని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ పేర్కొన్నారు. దశాబ్దాలుగా వస్తున్న ఆచారాన్ని ఇలా అడ్డుకోవడం అపచారం అని తెలిపారు.

ప్రభలన్నీ పల్లెల నుంచే బయలుదేరతాయని వివరించారు. పల్లెల్లో పంచాయతీ ఎన్నికలు ముగిశాయని, కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పాలే కానీ, ప్రభలు కట్టొద్దని ఆదేశించడం ముమ్మాటికీ సంప్రదాయాలను కాలరాయడమేనని విమర్శించారు. ఇది భక్తుల మనోభావాలు, ఆచారాలకు సంబంధించిన విషయం అని లోకేశ్ స్పష్టం చేశారు. ఇటీవల పరమపవిత్రమైన తిరుమల లడ్డూలను ఓటర్లకు పంచారని, అది నిబంధనల ఉల్లంఘన అవుతుంది తప్ప, తరతరాలుగా వస్తున్న ప్రభలు కాదని వివరించారు.


More Telugu News