వ్యక్తిగత కారణాలతో నాలుగో టెస్టుకు బుమ్రా దూరం

  • ప్రకటించిన బీసీసీఐ
  • టీమ్ లో ఎలాంటి మార్పులుండవని వెల్లడి
  • బుమ్రా స్థానంలో ఎవరినీ తీసుకోవట్లేదని స్పష్టీకరణ
  • సిరీస్ లో రెండు మ్యాచ్ లాడి 4 వికెట్లు తీసిన ఏస్ పేసర్
ఇంగ్లాండ్ తో నాలుగో టెస్టుకు ఏస్ పేసర్ బుమ్రా దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాలతో మ్యాచ్ నుంచి వైదొలిగాడు. ఈ మేరకు జస్ప్రీత్ బుమ్రా విజ్ఞప్తికి బీసీసీఐ ఓకే చెప్పింది. బుమ్రా నాలుగో టెస్టుకు అందుబాటులో ఉండడని ప్రకటించింది.

వ్యక్తిగత కారణాల వల్ల తనను మ్యాచ్ నుంచి మినహాయించాల్సిందిగా బుమ్రా కోరాడని పేర్కొంది. దీంతో బుమ్రాకు విశ్రాంతినిచ్చామని, అతడి స్థానంలో కొత్తగా ఎవరినీ తీసుకోబోమని తెలిపింది. టీమ్ నూ ప్రకటించింది. కాగా, నాలుగో టెస్టు కూడా అహ్మదాబాద్ లోని మొతెరా వేదికగానే జరుగనుంది. మార్చి 4న మ్యాచ్ మొదలు కానుంది.
 
నాలుగో టెస్టుకు టీమ్ ఇదీ

విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, శుభ్ మన్ గిల్, ఛటేశ్వర్ పుజారా, అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, ఇషాంత్ శర్మ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్

కాగా, ఈ సిరీస్ లో బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టాడు. మొదటి మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో మూడు, రెండో ఇన్నింగ్స్ లో ఒక వికెట్ కూల్చాడు. అయితే, రెండో మ్యాచ్ కు దూరమయ్యాడు. మళ్లీ మూడో మ్యాచ్ ఆడినా.. ఫాస్ట్ బౌలర్లకు పెద్దగా పని లేకుండా అయిపోయింది. మొతెరా పిచ్ పై స్పిన్నర్లే వికెట్లను పడగొట్టారు. సింహ భాగం ఓవర్లను స్పిన్నర్లే వేశారు.


More Telugu News