మహారాష్ట్రను మళ్లీ కమ్మేస్తున్న కరోనా.. దాదాపు అన్ని జిల్లాల్లో విజృంభణ!

  • 36 జిల్లాలకు 28 జిల్లాల్లో కరోనా ప్రభావం
  • పూణేలో ఎక్కువగా యాక్టివ్ కేసులు
  • ముంబై, థానే, అమరావతిలను వెనక్కు నెట్టేసిన నాగ్ పూర్
  • అమరావతి జిల్లాలో ఎక్కువగా పాజిటివ్ రేటు, కేసుల వృద్ధి
మహారాష్ట్రను కరోనా మళ్లీ కమ్మేస్తోంది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ విజృంభిస్తోంది. దీంతో అక్కడ సెకండ్ వేవ్ మొదలైపోయిందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇన్నాళ్లూ 36 జిల్లాలున్న రాష్ట్రంలో ఐదారు జిల్లాల్లోనే కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నా.. ఇప్పుడు 28 జిల్లాల్లో దాని ప్రభావం కనిపిస్తోంది. విదర్భ రీజియన్ లోనే కరోనా యాక్టివ్ కేసులు ఎక్కువగా ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్ర సగటు కరోనా వృద్ధి రేటు 0.28 శాతం కాగా, పాజిటివ్ రేటు 9.5 శాతంగా ఉంది.

ఫిబ్రవరిలో పూణేలోనే ఎక్కువగా 12,577 యాక్టివ్ కేసులుండగా.. ఆ తర్వాత నాగ్ పూర్ లో 9,141 యాక్టివ్ కేసులున్నాయి. ఈ విషయంలో ముంబై (7,899), థానే (7,276), అమరావతి (6,740)లను నాగ్ పూర్ వెనక్కు నెట్టేసింది. ఈ ఐదు జిల్లాల్లోనే దాదాపు 65 శాతం దాకా యాక్టివ్ కేసులున్నాయి. 1.3 కోట్లున్న ముంబై జనాభాతో పోలిస్తే.. 50 లక్షల జనాభా ఉన్న నాగ్ పూర్ లో అన్ని యాక్టివ్ కేసులుండడం ప్రస్తుతం అధికారులను కలవరపెడుతోంది.

కరోనా కేసుల పెరుగుదల రేటు, పాజిటివిటీ రేటు అమరావతి జిల్లాలోనే ఎక్కువగా ఉంది. ఆ తర్వాత అకోలాలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. ఒక వారంలో పాజిటివ్ రేటు ఎక్కువగా నమోదైన జిల్లా అమరావతే. గత వారంలో అక్కడ 41.5 శాతం మేర పాజిటివ్ రేటుంది. అలోకాలో 30.8 శాతంగా నమోదైంది.

కాగా, ఇది సెకండ్ వేవా? కాదా? అన్న విషయాన్ని పక్కనపెడితే.. రాబోయే రెండు మూడు నెలల పాటు కేసుల తీవ్రత పెరుగుతుందని ప్రభుత్వ కరోనా టాస్క్ ఫోర్స్ అధికారి డాక్టర్ సుభాష్ శలుంకే హెచ్చరించారు. కొన్ని జిల్లాల్లో కరోనా వ్యాప్తి చాలా వేగంగా ఉందని, మరికొన్ని చోట్ల నిదానంగా జరుగుతోందని పేర్కొన్నారు.

ఈ నెల 23 నాటికి జిల్లాల వారీగా కేసుల వృద్ధి రేటు (టాప్ 5 జిల్లాలు)

  • అమరావతి     2.7%
  • అకోలా           1.7%
  • వాషిం            0.9%
  • వార్ధా              0.9%
  • బుల్దానా         0.8%

జిల్లాల వారీగా వీక్లీ (గత వారపు) పాజిటివ్ రేటు

  • అమరావతి    37.4%
  • అకోలా          29.8%
  • బుల్దానా        25%
  • యవత్మాల్   22.9%
  • నాగ్ పూర్     18.5%
  • నాశిక్           18.3%
  • వార్ధా            17%
  • పుణే             16.2%
  • వాషిం          11.5%
  • నందర్బార్   11.4%


More Telugu News