మే 2న నా చివరి ట్వీట్ కోసం వేచి చూడండి: ప్రశాంత్ కిశోర్

  • దేశ వ్యాప్తంగా వేడి పుట్టిస్తున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు
  • బెంగాల్ లో పాగా వేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్న బీజేపీ
  • మమతకు వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ప్రశాంత్ కిశోర్
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు దేశ రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్నాయి. బెంగాల్ లో ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతుండగా... మరోసారి అధికారాన్ని నిలుపుకోవాలనే పట్టుదలతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉన్నారు. ఈ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరోవైపు మమత విజయం కోసం ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పని చేస్తున్నారు. ఆయనకు చెందిన ఐప్యాక్ సంస్థ ఎన్నికల్లో దీదీ పార్టీ గెలుపుకోసం వ్యూహాలు, ప్రతి వ్యూహాలను రచిస్తోంది. 'బెంగాల్ తన సొంత కూతురునే కోరుకుంటోంది' అనే నినాదంతో మమత పార్టీ ప్రచారం చేసుకుంటోంది. ఈ నినాదాన్ని రూపొందించింది కూడా ప్రశాంత్ కిశోర్ సంస్థే.

మరోవైపు మమత పార్టీ గెలుపుపై ప్రశాంత్ కిశోర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఉదయం ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ... ప్రజాస్వామ్యం కోసం జరుగుతున్న కీలక యుద్ధాల్లో ఒకటి ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లో జరుగుతోందని అన్నారు. 'బెంగాల్ తన సొంత కూతురునే కోరుకుంటోంది' అనే సందేశంతో రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మే 2వ తేదీన తన చివరి ట్వీట్ చూసేందుకు సిద్ధంగా ఉండండి అని ట్వీట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 2న వెలువడనున్న సంగతి తెలిసిందే.


More Telugu News