మాకు మాత్రమే 8 విడతల్లో ఎన్నికలను ఎందుకు నిర్వహిస్తున్నారు?: మమతా బెనర్జీ

  • నాలుగు రాష్ట్రాలు, ఒక యూటీకి ఎన్నికలు
  • బెంగాల్ కు 8 విడతల్లో జరగనున్న పోలింగ్
  • బీజేపీ సౌకర్యం కోసమే ఈసీ ఈ నిర్ణయం తీసుకుందని మమత ఆరోపణ
తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగిన సంగతి తెలిసిందే. మార్చి 27 నుంచి ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఫలితాలు వెలువడతాయి. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలకు ఏప్రిల్ 6న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. అసోంకు మూడు విడతల్లో పోలింగ్ జరగబోతోంది. పశ్చిమబెంగాల్లో మాత్రం 8 విడతల్లో పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ పై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు.

ఒక్క బెంగాల్ కు మాత్రమే 8 విడతల్లో పోలింగ్ ను ఎందుకు నిర్వహిస్తున్నారని మమత ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని తాము గౌరవిస్తున్నామని చెపుతూనే... బీజేపీ సౌకర్యం కోసమే ఈసీ ఇన్ని విడతల్లో పోలింగ్ నిర్వహిస్తోందని ఆరోపించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సలహా మేరకే ఈ నిర్ణయం తీసుకున్నారా? అని ప్రశ్నించారు. బెంగాల్ లో బీజేపీ ప్రచారాన్ని సులభంగా నిర్వహించుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నారా? అని అడిగారు.

ఒకే జిల్లాలో వేర్వేరు దశల్లో పోలింగ్ నిర్వహించాలనే నిర్ణయంపై కూడా మమత మండిపడ్డారు. దక్షిణ 24 పరగణా జిల్లాలో తాము బలంగా ఉన్నామని... ఆ జిల్లాలో మూడు దశల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారని విమర్శించారు. మతం ఆధారంగా ప్రజలను బీజేపీ విభజిస్తోందని దుయ్యబట్టారు. ఆట ప్రారంభమైందని... ఆటలో గెలిచి చూపిస్తామని అన్నారు.


More Telugu News